హైదరాబాద్‌కు ఈడీ బృందాలు వచ్చేశాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా సృజన్ రెడ్డి, అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్ళలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈడీ సోదాలు చేస్తే విశేషం ఏమిటి? అంటే బహుశః అందరికీ తెలిసిందే. ఈ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకపాత్ర పోషించారని ఢిల్లీలో ఇద్దరు బిజెపి నేతలు ఆరోపించడం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు పుట్టించాయి.
“మేము ధైర్యంగా మోడీ ప్రభుత్వాన్ని నిలదీసి విమర్శిస్తున్నందున ఏదో రోజు ఈడీ, సీబీఐ బృందాలు మాపై కూడా దాడి చేయకమానవని,” సిఎం కేసీఆర్ పలుమార్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేసీఆర్ కుటుంబం అవినీతి చిట్టా కేంద్రం వద్ద ఉందని, తగిన సమయంలో తగిన చర్యలు తీసుకొంటుందని చాలాసార్లు చెప్పారు. కనుక ఇప్పుడు అదే జరుగుతున్నట్లుంది.
Also Read – కేసీఆర్, కేటీఆర్ మద్యలో కవిత… ఏమిటో ఈ రాజకీయాలు?
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నిందితులుగా భావిస్తున్న సృజన్ రెడ్డి, అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్‌ల ఇళ్ళలో నేడు 25 ఈడీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈడీ తదుపరి లక్ష్యం కల్వకుంట్ల కవితే కనుక ఈ సోదాలతో సిఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడికి గురవుతారని వేరే చెప్పక్కరలేదు. కానీ ఈడీ సోదాలు ఇక్కడితోనే సరిపెట్టవచ్చు.
ఎందుకంటే, కొన్ని రోజుల క్రితం ఓ ప్రెస్‌మీట్‌లో సిఎం కేసీఆర్ మాట్లాడుతూ “దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి…” అని కేంద్రానికి సవాల్ చేయడం ఈ సందర్భంగా గుర్తుచేసుకొంటే, ఈడీ మరో అడుగు ముందుకు వేసి కల్వకుంట్ల కవిత జోలికి వస్తే ఏమవుతుందో ఊహించవచ్చు. కల్వకుంట్ల కవిత ఇంట్లో సోదాలు జరిపితే, టిఆర్ఎస్ పెద్ద ఎత్తున తెలంగాణలో ఆందోళనలు నిర్వహించి తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం తప్పక చేస్తుంది.
Also Read – స్థలాలు, పొలాల కబ్జాలు కాదు… పోర్టునే కబ్జా చేస్తే?
అప్పుడు తెలంగాణలో రాజకీయ వాతావరణం బిజెపికి వ్యతిరేకంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి, భయాందోళనలు కలిగించేందుకే ఈడీ సోదాలు పరిమితం కావచ్చు. కానీ వీటితో కేంద్ర ప్రభుత్వం సిఎం కేసీఆర్‌కు స్పష్టమైన హెచ్చరిక పంపినట్లే భావించవచ్చు.