ఓ సినిమా కోసం అందరి కంటే ఎక్కువగా ఎవరు ఎదురుచూస్తారు? అభిమానులే! సినిమా రిలీజ్ ముందు ప్రతీ ఫంక్షన్‌లో మీ అభిమానుల వలననే మేము నేడు ఈ స్థాయికి ఎదిగాము. మీరే మా ప్రత్యక్ష దేవుళ్ళు… మీ రుణం జన్మజన్మలకి తీర్చుకోలేమని హీరోలు చిలక పలుకులు పలుకుతూ ఉంటారు.
వారు చెప్పిన దానిలో మొదటిది నిజం రెండోది అబద్దం! అభిమానుల రుణం తీర్చుకోవాలనుకుంటే వారి కోసం ప్రత్యేకంగా ప్రీమియర్ షో వేసి, టికెట్‌పై 50 శాతం రాయితీ ఇచ్చి వారి రుణం తీర్చుకోవచ్చు. కానీ వారి నుంచే అదనంగా ఛార్జీలు వసూలు చేసుకుంటున్నారు!
పైగా తమ సినిమాకి టికెట్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని వారికే గర్వంగా చెపుతుంటారు. దాంతో తమ జేబులకు బొక్క పడుతుందని తెలిసి ఉన్నా అభిమానులు అభిమానంతో చప్పట్లు కొడతారు.
తమ హీరో సినిమాకి ఆ అభిమానులే బారీగా డబ్బు చెల్లించుకొని, ఆ వచ్చిన ఆ కలెక్షన్స్ చూసి కూడా సంతోషపడుతుంటారు ఆ అమాయకులు.
సరే… అభిమానుల నుంచి ఎక్కువ టికెట్ ఛార్జీలు వసూలు చేశాము కనుక వారి కోసం ఓ స్పెషల్ సాంగ్ లేదా సన్నివేశాలు అదనంగా వేసి చూపిస్తారా?అంటే లేదు… ఓ పాట తక్కువే వేసి చూపిస్తారు.
ఏమంటే ఎడిటింగ్ పూర్తవలేదని కుంటి సాకులు చెపుతారు. కానీ సినిమా విడుదలైన నాలుగో రోజుకి లేదా కలెక్షన్ డ్రాప్ అవుతున్నాయని అనిపించగానే ఆ పాటని కూడా విడుదల చేస్తారు. చేసి మళ్ళీ సినిమా చూసి ఆనందించమని చెపుతారు. అదేదో వారికి ఫ్రీగా సినిమా చూపిస్తున్నట్లు!
అంటే మామూలు టికెట్ ఛార్జీల కంటే అదనం ఓ రూ.7-800 చెల్లించి సినిమా చూసిన పాపానికి అభిమానులు ఆ పాట కోసం మరోసారి మళ్ళీ రూ.5-600 వందలు చెల్లించి ఆ సినిమా చూసి ప్రాయశ్చిత్తం చేసుకోవవాలన్న మాట! ఇది అభిమాన దేవుళ్ళని, సినీ ప్రేక్షకులను మోసం చేయడం కాదా?
సినిమా చూసే వాళ్ళందరూ డబ్బు చెల్లించే చూస్తున్నారు. కనుక అందరూ వినియోగదారుల కిందే లెక్క. మరి నిర్మాతలు లేదా సినీ నిర్మాణ సంస్థలు వినియోగదారులను ఈ విదంగా మోసం చేస్తుంటే ప్రభుత్వాలు, వినియోగదారుల సంఘాలు ఎందుకు చోద్యం చూస్తుండిపోతున్నాయి?
చివరిగా ఓ ప్రశ్న: అభిమానులకే ఈవిదంగా కుచ్చు టోపీ పెట్టడం ఏం న్యాయం?






