టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర కధానాయికగా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ మరికొద్ది గంటల్లో “సరైనోడు” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రకుల్ తన హైదరాబాద్ అనుభవాలను మీడియా వర్గాలతో పంచుకుంది.
“హైదరాబాద్ నాకు చాలా బాగా నచ్చింది. మూడేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. దీంతో హైదరాబాద్ లోనే సొంతిల్లు కొనుక్కున్నానని, అయితే ఇంకా ఆ ఇంట్లోకి ప్రవేశించలేదని తెలిపింది. ఇప్పటివరకు హోటల్స్ లో ఉండి ఉండి విసుగు చెందానని, షూటింగ్ అయిపోయిన తర్వాత హోటల్ కు వెళ్లాలంటే చాలా బోరుగా ఉంటుందని, అంతే కాకుండా, హోటల్ ఫుడ్ తినీ తినీ విరక్తి వచ్చేసిందని, సహజంగా ఇంటి వంటను అమితంగా ఇష్టపడతానని అందుకే హైదరాబాద్ లో ఇల్లు కొనాలనే నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చింది ఈ అందాల భామ.
టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లే వస్తున్నారు… అలాగే ఇప్పటికే సమంత, కాజల్, శృతిహాసన్ వంటి అగ్ర నాయికలు తెలుగు చిత్ర సీమలో సెటిల్ అయ్యారు. అయితే రకుల్ మాదిరి ఎవరూ హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు. చూడబోతుంటే పర్మినెంట్ గా ఉమ్మడి రాజధానిలోనే నివాసం ఏర్పరచుకునేలా కనపడుతోంది రకుల్.



