“ఫిదా” సినిమాకు దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ములకు గానీ… నిర్మించిన దిల్ రాజుకు గానీ… నటించిన వరుణ్ తేజ్, సాయిపల్లవిలకు గానీ… బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు… ఈ సినిమా 50 కోట్ల చేరువలోకి వస్తుందని..! ఊహించని సినిమాలే అద్వితీయ విజయాలను అందుకుంటాయి అని చెప్పడానికి నిదర్శనమే “ఫిదా” సక్సెస్. కేవలం శేఖర్ కమ్ముల బ్రాండ్ తో విడుదలైన ఈ సినిమా అటు ఓవర్సీస్ లో ఏకంగా 2 మిలియన్ క్లబ్ లో చేరిపోగా, మొత్తంగా 50 కోట్ల క్లబ్ లో చేరడానికి కేవలం మరో రెండు, మూడు కోట్ల దూరంలో ఉందనేది ట్రేడ్ సమాచారం.
ఈ సక్సెస్ లో సింహాభాగం సాయిపల్లవికి వెళ్ళిపోగా, మిగిలిన దాంట్లో శేఖర్ కమ్ముల – దిల్ రాజు – వరుణ్ తేజ్ లు పంచుకున్నారు. ‘ఫిదా’ తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి గానీ, ఏపీ, తెలంగాణాలలో ఇప్పటికీ కొన్ని ధియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం విశేషం. అయితే 50 కోట్ల క్లబ్ లో చేరడానికి అవసరమైన ఆ రెండు, మూడు కోట్లను మాత్రం సాధిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాటు ‘నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, ఫిదా’ సినిమాలు ధియేటర్లను పంచుకున్నాయి.
మరో వారంలో పూరీ జగన్నాధ్ – నందమూరి బాలకృష్ణల “పైసా వసూల్” ఎంట్రీ ఇస్తుండడంతో, ధియేటర్లన్నీ ఖాళీ కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న “అర్జున్ రెడ్డి” సినిమాతో పాటు ఎక్కువ ధియేటర్లు “పైసా వసూల్”కు వెళ్ళిపోతాయి. అంటే ఈ వారం రోజుల లోపునే “ఫిదా”కు 50 కోట్ల క్లబ్ లో చేరడానికి అవకాశం దక్కుతుంది. ఒక్క వారంలో మూడు కోట్లు వసూలు చేయడమంటే… ప్రస్తుతం అసాధ్యంగానే కనపడుతోంది. అయితే అంచనాలకు మించి వచ్చిన రెవిన్యూ మాదిరే, ఊహించని విధంగా 50 క్లబ్ లో చేరితే మాత్రం, ఇది మరొక ‘బాహుబలి’ లాంటి విజయమే అని చెప్పాలి.


