ఇటీవల ఎన్ కౌంటర్ అయిన నయీం కేసును లోతుగా విచారిస్తున్న ‘సిట్’ బృందానికి అవాక్కయ్యే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే బయటపడిన నిజాలు సంచలనాత్మకంగా మారగా, తాజాగా తెలుగు సినీ పరిశ్రమ వర్గాలతో కూడా నయీం డీల్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాను నిర్మించిన ఓ ప్రముఖ నిర్మాతను నయీం బెదిరించినట్లుగా ఆధారాలు లభించినట్లు సమాచారం.
నయీం బెదిరింపులకు భయపడిన సదరు నిర్మాత ఏకంగా 8.5 కోట్ల రూపాయలు ముట్టచెప్పినట్టు సిట్ అధికారులు గుర్తించారు. అలాగే కింది స్థాయి నుంచి వచ్చిన పలువురు నిర్మాతలను నయీం బెదిరించినట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు ఓ సినిమా తీయాలని భావించిన నయీం, ఈ దిశగా పలువురు టాలీవుడ్ దర్శకులతో సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం.
ఇటీవలే నానక్ రామ్ గూడలో ఒక బిజినెస్ మ్యాన్ తో పలు డీల్స్ లో భాగం పంచుకున్నట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఈ ఆర్ధిక విషయాలపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివిధ బ్యాంకులలో దాదాపు 250 ఎకౌంటు ఖాతాలు ఉన్నట్లుగా పోలీస్ వర్గాలు వెల్లడించారు. తాజాగా జరుగుతున్న విచారణలో ఇంకెన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.



