టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ బంగారం లాంటి అవకాశం వినియోగించుకోవడంలో తడబడ్డాడు. గాయం, ఫాం లేమితో జట్టులో చోటు కోల్పోయిన గంభీర్… మూడో టెస్టు ద్వారా పునఃప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ లో 29 పరుగులు చేసి జోరు మీదున్న దశలో బంతిని అంచనా వేయడంలో తడబడ్డ గంభీర్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
రెండో ఇన్నింగ్స్ లో అయినా సత్తా చాటడం ద్వారా టీమిండియాలో స్థానం పదిలం చేసుకోవచ్చని భావించిన గంభీర్ వస్తూనే ఫోర్ బాది దూకుడు ప్రదర్శించాడు. బోల్ట్ సంధించిన మూడో ఓవర్ 5 బంతిని స్వ్కవేర్ లెగ్ దిశగా కొట్టిన గంభీర్ లేని రెండో పరుగుకు ప్రయత్నించి, వికెట్లను చేరే క్రమంలో డైవ్ చేశాడు. దీంతో గతంలో దేని కారణంగా జట్టుకు దూరమయ్యాడో అదే గాయం తిరగబెట్టింది.
కుడిచేతి భుజం గాయపడింది. దీంతో ఫిజియోను పిలిచి గంభీర్ కొంత ఉపశమనానికి ప్రయత్నించినా, ఫలితం లేకపోవడంతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా పుజారాను రంగంలోకి దించింది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత రాక రాక వచ్చిన అవకాశం ఇలా నీరుకారిపోవడంతో గంభీర్ ను చూసి జాలిపడుతుతుండడం అభిమానుల వంతవుతోంది.



