గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి (73) హైదరాబాద్ సింధూ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ముద్రగడ జీవితం తెరిచిన పుస్తకం. అయన 1978లో జనతాపార్టీ తరపున, ఆ తర్వాత 1983, 1985లో టీడీపి తరపున ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1989లో మళ్ళీ గెలిఛి మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
రాజకీయాలలో గెలుపోటములు సహజమే. 1994లో ప్రత్తిపాడులోనే ఓడిపోయారు. కానీ మళ్ళీ టీడీపిలో చేరి 1999లో కాకినాడ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు 2004 ఎన్నికలలో ఓడిపోయారు.
మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి 2009లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దాంతో మళ్ళీ ఆ పార్టీ వీడి 2014లో ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.
అందరికీ తెలిసిన ఈ విషయాలను ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, అయన తరచూ పార్టీలు మారుతూ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి స్థాయికి ఎదిగినప్పటికీ, అదే కారణంగా రాజకీయంగా ఎదగాల్సిన స్థాయికి ఎదగలేకపోయారని చెప్పడానికే!
ముఖ్యంగా అయన రాజకీయ జీవితం చరమాంకంలో అంటే 2024 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరడం అతిపెద్ద తప్పిదమని రుజువైంది.
కాపు సమాజికవర్గానికి నాయకుడుగా ఎంతో గౌరవమర్యాదలు అందుకున్న ముద్రగడ కొన్నిసార్లు ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు అవమానపడలేదు. కానీ వైసీపీ అధినేత జగన్ కోసం తనది కాని యుద్ధం చేసి, దానిలో వైసీపీ ఓడిపోతే ముద్రగడ తన పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకోవాల్సి వచ్చింది.
ఈ అప్రదిష్ట ఆయనని బాగా క్రుంగదీసింది. అప్పటికే ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కనుక మరింత వేగంగా ఆయన ఆరోగ్యం దెబ్బ తింది. తుది శ్వాస విడిచారు.
ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పింఛి తుది వీడ్కోలు పలికేందుకు జగన్మోహన్ రెడ్డి నేడు కిర్లంపూడికి బయలుదేరుతున్నారు.




