సంక్రాంతి బరిలో ఉన్న రెండు సినిమాలు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో మిగిలి ఉన్న మూడవ సినిమా నందమూరి నటసింహం 100వ చిత్ర “గౌతమీపుత్ర శాతకర్ణి”పై ఒత్తిడి నెలకొంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటోన్న ఈ చిత్రం జనవరి 5వ తేదీన సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లనుందని తెలుస్తోంది. అయితే ఒక్కసారి సెన్సార్ పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటించి, ఆకాశమే హద్దుగా పబ్లిసిటీ చేసే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
ముఖ్యంగా ధియేటిరికల్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించడంతో, సినిమా విడుదలకు ముందు మరో ట్రైలర్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా టాక్. అలాగే ఆడియో వేడుక తరహాలోనే మరో భారీ ఈవెంట్ ‘ప్రీ రిలీజ్ వేడుక’ను కూడా జరపాలని తెలుస్తోంది. చిత్ర యూనిట్ అంచనాల ప్రకారం జనవరి 5వ తేదీన సెన్సార్ పూర్తయితే, జనవరి 12వ తేదీన సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని ప్లానింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం.



