ఏపీ రాజధాని విజయవాడలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్ర యూనిట్ ప్రత్యక్షమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం స్పెషల్ షో వేసిన నేపధ్యంలో… చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… ప్రతి తెలుగువాడు, భారతీయుడు చూడదగ్గ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ అని, ఈ చిత్రం విజయం సాధించడమంటే, తెలుగుజాతి విజయం సాధించడమేనని అన్నారు. ఈ సినిమా చేయాలనే నిర్ణయం యాదృచ్ఛికంగా జరిగిందని, ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న అభిమానులు, ప్రేక్షకులందరికీ తన ధన్యవాదాలని చెప్పారు.
‘దేశం మీసం తిప్పుదాం’ అనే డైలాగ్ కు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా వ్యాఖ్యానించారు. తాము ఊహించిన దాని కంటే భారీ విజయం దక్కిందని, సంక్రాంతి పండగ ముందుగానే వచ్చిందని, తమ చిత్రానికి విదేశాల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తోందని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ చారిత్రాత్మక సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇచ్చిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాలకృష్ణ కృతఙ్ఞతలు తెలిపారు.
ఇక, ఈ చిత్ర దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ… ఈ చిత్రానికి తన సంతకంగా ‘అంజనాపుత్ర క్రిష్’ అని తన తల్లి పేరు తెరపై చూడటం గర్వంగా ఉందని, తోటి దర్శకుల నుంచి అభినందనలు అందుకోవడంపై సంతోషంగా ఉందని, తెలుగుజాతి గర్వించ దగ్గ సినిమా తీయడం ఆనందంగా అన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు మాదిరే తెలంగాణాలోనూ కేసీఆర్ ఈ సినిమా స్పెషల్ షోను వీక్షించబోతున్నారు. ఈ సినిమా ప్రారంభ రోజే, ఖచ్చితంగా ఫస్ట్ డేనే చూస్తానని కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.



