‘ఫస్ట్ లుక్’ ప్రామిసింగ్ గా ఉండడంతో గోపీచంద్ “ఆక్సిజన్” సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా నిరంతరం వాయిదాలు పడుతూ వస్తోంది. గోపీచంద్ కు సరసన రాశి ఖన్నా, అను ఇమ్మానుయేలు జంటగా నటించిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. తెలుగులో తరుణ్ తో ‘నీ మనసు నాకు తెలుసు’ అనే చిత్రం చేసిన జ్యోతి కృష్ణ, ఈ “ఆక్సిజన్”ను ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు.
అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ దసరా పండగకు ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేయనుండగా, అక్టోబర్ 27వ తేదీన సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో స్టంట్స్ ను ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హైన్స్ కంపోజ్ చేయగా, మరికొన్నింటిని స్టంట్ శివ రూపకల్పన చేసారు. చాలా కాలం తర్వాత ఈ “ఆక్సిజన్” ద్వారా యువన్ శంకర్ రాజా స్వరాలు మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాయి.


