కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో “జైలు – బైలు” మాత్రమే నడుస్తుందని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియా ముఖంగా టీడీపీ పై విమర్శలు ఎక్కుపెట్టారు.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి తో ములాఖత్ పూర్తి చేసుకుని మీడియా ముందుకొచ్చిన గోరంట్ల, మార్గాన్ని భారత్, శంకర్ నారాయణ పెద్ది బ్రాండ్ ను దెబ్బ తీసే కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డి అరెస్టు ఉందంటూ,
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకే వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి జైలుకు పంపుతున్నారని, తిరిగి వైసీపీ అధికారంలోకి రాగానే ఇందుకు టీడీపీ సరైన మూల్యం చెల్లించక తప్పదు అంటూ వైసీపీ మార్క్ బెదిరింపు విమర్శలు మొదలు పెట్టారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలలలో జైలు – బైలు తప్ప సంక్షేమం – అభివృద్ధి ఎక్కడ కానరాలేదు అంటున్న గోరంట్ల మాధవ్ కు అమరావతి అభివృధి కనిపించడం లేదా.? ఐటీ హబ్ గా విశాఖ ఎదుగుదల ఒప్పోకోలేరా.? రాష్ట్రానికి తరలి వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు కానరావడం లేదా.?
లేక కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేయడం తెలియడం లేదా.? స్త్రీ శక్తి పేరుతో మహిళకు ఉచిత బస్సు సౌకర్యాలు, ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు, పేదల కడుపు నింపే అన్న క్యాంటిన్లు …ఇలా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు వైసీపీ నేతల చెవున పడలేదా.? కంటికి ఆనలేదా.?
జైళ్లు – బైళ్ళు అనేది చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో పాలన పక్కన పెట్టి కక్ష్య రాజకీయాలు, అవినీతి కుంభకోణాలు చేసి ఇప్పుడు ఆధారాలతో అడ్డంగా దొరికిపోయి కూడా అక్రమం, అన్యాయం అంటూ గుండెలు బాదుకుంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా.?
నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలలో భాగంగానే వైసీపీ నేతల మీద కేసులు పెడితే అందుకు కూటమి పార్టీలకు సరైన తీర్పు ప్రజా కోర్ట్ లోనే తేలుతుంది. గతంలో వైసీపీని 151 సీట్లతో అందలం ఎక్కించిన ప్రజలే జగన్ పాలన నచ్చక, వైసీపీ విధానాలు రుచించక 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడించారు.





