ఏపీకి లక్షల కోట్లు వచ్చేస్తున్నాయట… లోకేష్‌ ఎఫెక్టేనా?

GudivadaAmaranath_Eenadu_Paperఏపీ ఐ‌టి పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి శనివారం విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. మార్చి 3,4 తేదీలలో విశాఖలో జరుగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, అనేక పరిశ్రమలు రాబోతున్నాయని, వాటితో రాష్ట్రంలో వేలాదిమందికి ఉద్యోగాలు లభించబోతున్నాయని చెప్పారు. ఈ ఒక్క సమిట్‌తో రాష్ట్రం ముఖ చిత్రం సమూలంగా మారిపోబోతోందని చెప్పారు.

మరో వారం రోజులలో మొత్తం ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయో, ఎన్నివేలమందికి ఉద్యోగాలు వస్తాయో స్పష్టమైపోతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి చెప్పారు. దేశంలో గుజరాత్‌ తర్వాత ఏపీకే అతిపొడవైన సముద్రతీరం ఉందని, దీని ఆధారంగా విశాఖ నుంచి చెన్నై వరకు రాష్ట్రంలో అనేక పోర్టులు, ఆక్వా కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు వగైరా ఏర్పాటు చేసుకోవచ్చునని, రవాణా, పర్యాటక తదితర రంగాలలో కూడా పెట్టుబడులకి అవకాశాలున్నాయని తెలిపారు. మార్చి 3,4 తేదీలలో వివిద కంపెనీలతో ఎంవోయులు జరిగినప్పటి నుంచి ఆరు నెలలలోగా ఎవరు పరిశ్రమని ప్రారంభిస్తారో వారికి ప్రత్యేక రాయితీలు అందిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి చెప్పారు.

ADVERTISEMENT

అయితే ఏపీ అభివృద్ధి చెందడం ఎంత మాత్రం ఇష్టం లేని ఈనాడు మీడియా అడ్డమైన రాతలు రాస్తూ ఈ సమాజానికి, రాష్ట్రానికి చాలా హానీకరంగా మారిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంటే, ఈనాడు పిచ్చిరాతలు రాస్తూ ఆయనపై బురద జల్లాలని ప్రయత్నిస్తోందన్నారు. ఒకవేళ రామోజీరావుకి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఢీకొనాలని ఉంటే ఆయనే స్వయంగా ఓ రాజకీయ పార్టీ పెట్టుకొని ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి సవాలు విసిరారు.

ఏపీకి అనేక సహజవనరులు, ఆధ్యాత్మిక, పర్యాటక ఆకర్షణ కేంద్రాలు ఉన్నాయని మంత్రి గుడివాడ చెప్పడం చాలా సంతోషమే. అయితే వాటిని అభివృద్ధి చేసి వాటి ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సంపాదించుకోవాలనే ప్రయత్నం కనీసం ఆలోచన మూడున్నరేళ్ళుగా చేయకపోవడమే ప్రజల దౌర్భాగ్యం.

మూడున్నరేళ్లుగా అభివృద్ధి అంటే సంక్షేమ పధకాల అమలే అనే భ్రమలో ఉంటూ ఎడాపెడా అప్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుంటే రాష్ట్రాభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన అంటూ మాట్లాడటం మొదలుపెట్టింది. తెలంగాణలో అత్యద్బుతమైన పారిశ్రామిక విధానాలతో, అన్నివిధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ రాజధానిని శరవేగంగా అభివృద్ధి చేస్తూ, ఆ రాష్ట్ర ఐ‌టి పరిశ్రమల శాఖల మంత్రి విదేశాలలో పర్యటించి ఎంతో కృషి చేస్తేనే లక్షల కోట్ల పెట్టుబడులు సాధించలేకపోతున్నారు.

కనీసం రాజధాని కూడా లేకుండా, సరైన రాజకీయ వాతావరణం లేకుండా, గట్టి ప్రయత్నాలు చేయకుండా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ నిర్వహించేస్తే చాలు… రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తాయని మంత్రి గుడివాడ నమ్మబలుకుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది!

అసలు వైసీపీ హటాత్తుగా సంక్షేమ పధకాల డప్పు పక్కన పెట్టి అభివృద్ధి డప్పు ఎందుకు వాయిస్తోందంటే అక్కడ తిరుపతిలో నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో తమ ప్రభుత్వం హయాంలో స్థాపించిన పరిశ్రమలని, కల్పించిన ఉద్యోగాలని సెల్ఫీ ఫోటోలతో సహా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతీరోజూ సవాలు చేస్తున్నారు కనుకనే! అందుకే మంత్రి గుడివాడ లక్షల కోట్లు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు అంటూ కబుర్లు చెపుతున్నట్లు భావించవచ్చు. నిజంగా ఆయన మాటలు నిజమై ఏపీకి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తే, రాష్ట్రంలో యువతకి ఇక్కడే ఏపీలోనే ఉద్యోగాలు లభిస్తే అంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది?

ADVERTISEMENT
Latest Stories