తెలంగాణని ఎవరు దోచుకుంటున్నారు? అని బీఆర్ఎస్ పార్టీని అడిగితే అధికార కాంగ్రెస్ నేతలని చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు, వాటి నేతలు కూడా తెలంగాణపై కన్నేశారని, అందుకే దొడ్డిదారిలో వస్తున్నారని ఆరోపిస్తూనే ఉంటుంది. కానీ ఇదే ప్రశ్న కాంగ్రెస్ పార్టీని అడిగితే, బంగారు తెలంగాణ పేరుతో కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణ సంపదను దోచుకుందని చెబుతుంది.
ఈ రెండు పార్టీల ఆరోపణలు పక్కన పెడితే, ఇటీవల తెలంగాణ ఏసీబీ అధికారులు వరుసగా నిర్వహిస్తున్న దాడుల్లో అవినీతికి పాల్పడి వందల కోట్ల ఆస్తులు పోగేసుకున్న ప్రభుత్వాధికారులు పట్టుబడుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలను, తెలంగాణ సంపదను అవినీతి అధికారులు కూడా దోచుకుంటున్నారని స్పష్టమవుతోంది.
తాజాగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట తహసీల్దార్ తుమ్మకొమ్మ సుచరిత ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేసి, సుమారు యాభై కోట్ల రూపాయల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు. ఒక సాధారణ తహసీల్దార్ ఇంత అక్రమాస్తులు పోగేసుకోవడం చూస్తే తెలంగాణ ప్రభుత్వ వ్యవస్థల్లో ఎంతగా అవినీతి పేరుకుపోయిందో అర్థమవుతుంది.
అయితే ఈ పరిణామం మరో కోణాన్ని కూడా చూపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌తో సహా చుట్టుపక్కల జిల్లాలు, పట్టణాలు అభివృద్ధి చెందాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి.
ఈ అభివృద్ధి ఫలాలు తెలంగాణ ప్రజలకు దక్కాల్సి ఉండగా, కొందరు రాజకీయ నాయకులకు, ఇటువంటి కొందరు అవినీతి అధికారులకు అవకాశాలు కల్పించింది. తెలంగాణ ప్రజలను, రాష్ట్రాన్ని ఈ విధంగా కొందరు ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే, అధికార, ప్రతిపక్షాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటాయి.
ఏపీ రాజకీయ పార్టీలను, వాటి నాయకులను కూడా నిందిస్తూ తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాదు, ఆ విధంగా తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తూ రాజకీయ లబ్ధి పొందుతుంటారు.
అయితే రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ అవినీతి గురించి ఎవరూ మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విధంగా అవినీతి అధికారులు, రాజకీయ నాయకుల చేతుల్లో దోపిడీకి గురవుతున్న రాష్ట్ర ప్రజలకు తమను ఎవరు దోచుకుంటున్నారో రాజకీయ నాయకులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందా?




