ప్రిన్స్ మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది. అహ్మదాబాద్ లో షూటింగ్ జరుగుతున్నా గానీ, తెలుగు నేలపై జరుగుతున్నట్లుగా అభిమానగణం పోటేత్తడం సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ క్రేజ్ ఎక్కడి వరకు చేరుకుందంటే… ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న షూటింగ్ స్పాట్ కు ఏకంగా గుజరాత్ డిప్యూటీ సిఎం వచ్చేటంతగా!
అవును… అహ్మదాబాద్ లో జైడస్ హాస్పిటల్ లో జరుగుతున్న మహేష్ సినిమా షూటింగ్ స్పాట్ కు గుజరాత్ డిప్యూటీ సిఎం నితిన్ భాయ్ పటేల్ విచ్చేసారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఓ పక్కన మురుగదాస్, మరో పక్కన మహేష్ ను పెట్టుకుని దిగిన ఈ ఫోటోలో ఉన్న అందరి కంటే ఎత్తుగా కనపడుతున్న ప్రిన్స్ రేంజ్ కూడా ఆ స్థాయిలోనే ఉన్నట్లు అర్ధమవుతోంది.
ఇక, ఈ సినిమా టైటిల్ విషయమై నిర్మాత ఠాగూర్ మధు స్పందిస్తూ… తాము అనుకుంటున్న నాలుగు టైటిల్స్ లో ‘సంభవామి’ కూడా ఒకటని, అంతేగానీ, ఇప్పటివరకు ఏ టైటిల్ ను ఖరారు చేయలేదని, జనవరిలో టైటిల్ పై స్పష్టత వస్తుందని అన్నారు. మురుగదాస్ తెరకెక్కించిన ‘తుపాకీ’ తరహాలోనే ఈ సినిమా నేపధ్యం కూడా ఉంటుందని ప్రిన్స్ అభిమానులకు ఓ ‘క్లూ’ ఇచ్చారు.



