హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలలో బీజేపీ గెలిచింది. అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడి హిమాచల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. మరోవైపు గుజరాత్ లో కాంగ్రెస్ అనుకున్నదానికంటే గట్టి పోటీని ఇచ్చింది. ప్రధాని మోడీ కంచుకోటలో ఒకదశలో కాంగ్రెస్ జెండా ఎగరనుందేమో అని అనుకున్నారంతా. అయితే చావు తప్పి కన్ను లొట్టబోయింది కమలనాథులకు.
22 ఏళ్ల పాలన తరువాత ఎన్నికలు గెలవడం గొప్ప విషయమే అయినా ఇప్పుడు దేశంలోని మోడీ వేవ్ వల్ల ఈ విజయం చిన్నది గానే కనిపిస్తుంది. మొదటి విడత ఎన్నికలకు ఒకరోజు ముందు ఆ పార్టీ గుజరాత్ మేనిఫెస్టో విడుదల చెయ్యడం ప్రజలను తక్కువ అంచనా వేసిందని చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓడలు బండ్లవడం, బండ్లు వాడలవడం అనేది చాలా తేలిక అని మోడీ – షాలకు ఈ పాటికే తెలిసి ఉండాలి.
బీజేపీ మీద కోపం ఉన్న దేశం ప్రస్తుతానికి కాంగ్రెస్ ను ఆహ్వానించే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్ గెలుస్తాదేమో అనిపించిన దశలో స్టాక్ మార్కెట్ కుప్పకూలడం దీనికి చిహ్నం. దేశం కాంగ్రెస్ ను కోరుకోవడంలేదు అయితే అదే సమయంలో వారు మోడీ – షాల నియంతృత్వ పోకడలు కూడా హర్షించడం లేదు. దానిని ఎంత త్వరగా గుర్తిస్తే 2019 అంత తేలిక అవుతుంది.
దాదాపు నాలుగేళ్ల బీజేపీ పాలన ఎన్నికలలో విజయమే పరమావధిగా సాగింది. గోవా, అరుణాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల మెజారిటీ లేకపోయినా దొడ్డిదారిన అధికారంలోకి రావడం, టీడీపీలాంటి మిత్రపక్ష ప్రభుత్వాలని కావాలని ఇరుకున పెట్టడం, తమిళనాడులో కావాలని రాజకీయ అస్థిరత సృష్టించడం ఇవేమి మిస్టర్ క్లీన్ అనుకునే మోడీ నుండి ఎదురుచూసింది కాదు. నోట్ల రద్దు సమయంలో ఎన్నో ఇబ్బందులని తట్టుకుని కూడా మోడీకి మద్దత్తు ఇచ్చింది దేశం. దానిని పదిలపరుచుకుంటే వారికే మంచిది.



