భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపించే గుణశేఖర్.. వైవిధ్యభరిత పాత్రల్లో నటించడానికి ఆసక్తిని కనబరిచే రానా కలయికలో ‘హిరణ్యకశ్యప’ పేరుతో పౌరాణిక చిత్రం రూపొందబోతుంది. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పౌరాణిక గాథను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నామని, ఇప్పటిదాకా మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్కు మీద పని చేశామని గుణశేఖర్ చెబుతున్నారు.
అయితే ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లే అని, పెరిగితే గిరిగితే ఇంకో 20 కోట్లు పెరగొచ్చని అయితే సినిమాకు హైప్ పెంచడానికీ, ఫైనాన్సియర్స్ కోసమని బడ్జెట్ పెంచి చెబుతున్నాడని ఫిలింనగర్ వర్గాల భోగోట్టా. హిరణ్యకశ్యప ఎప్పటినుండి సెట్స్‌పైకి వెళ్లనుంది అనేదాని మీద కూడా క్లారిటీ లేదు. ఇంత మొత్తం సురేష్ బాబు ఒక్కరే పెట్టడానికి సిద్ధంగా లేడని, ఇంకో ఫైనాన్షియర్ లేదా పార్టనర్ దొరికిన తరువాతే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. ‘భక్త ప్రహ్లాద’ కథతో తెరకెక్కే ఈ చిత్రాన్ని అతని తండ్రి ‘హిరణ్యకశ్యప’ కోణంలో ఆవిష్కరించనున్నాడట గుణశేఖర్.
టైటిల్ రోల్‌లో మహా రాక్షసుడు హిరణ్యకశ్యపునిగా మెప్పించేందుకు ఆహార్యం, వాచికం విషయంలో తొందరలో ప్రత్యేక కసరత్తులు మొదలు పెడతాడట రానా. విజువల్‌గా ఈ మైథలాజికల్ మూవీని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రముఖ వి.ఎఫ్.ఎక్స్ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయట. బాలలతో పౌరాణిక చిత్రం ‘రామాయణం’ తీసి మంచి విజయాన్నందుకున్న గుణశేఖర్ ఈ మైథలాజికల్ మూవీతోనూ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.



