ఒకప్పటి హిట్ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ చాలా సంవత్సరాలుగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు. 2015లో విడుదలైన రుద్రమ్మదేవి కూడా పెద్దగా ఆడింది లేదు. ఇప్పుడు ఆయన మరో భారీ చిత్రాన్ని తెర మీదకు ఎక్కించడానికి సిద్ధం అవుతున్నారు. దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో “హిరణ్యకశిప” అనే పౌరాణిక గాథను తెరకెక్కిస్తున్నట్లు ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా తాను ఈ చిత్రం ప్రీ – ప్రొడక్షన్ పనుల మీద మూడు సంవత్సరాలు పని చేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు.
హిరణ్య కశిపుడు పురాణాల్లో రాక్షసుడు, ప్రహ్లాదుడి తండ్రి. శివ భక్తుడైన హిరణ్య కశిపుడు నరసింహావతారంలో వచ్చిన విష్ణువు చేతిలో మరణిస్తాడు. మరి రానా ఈ భారీ ప్రాజెక్టులో నెగెటివ్ షేడ్స్ ఉండే హిరణ్య కశిపుడిగా కనిపిస్తాడా లేక, ఆ పాత్ర స్పూర్తితో గుణశేఖర్ ఫిక్షనల్ స్టోరీ ఏదైనా రెడీ చేశాడా తెలియాల్సి వుంది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రానా, గుణశేఖర్ ల కేరీర్ లోనే అతిపెద్ద బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. సోలో హీరోగా రానా కు పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు లేవు.
దీనితో ఈ చిత్రంతో గుణ, రానా ఇద్దరు పెద్ద హిట్ కొట్టి తమ సత్తా చూపిస్తారేమో చూడాలి. ప్లాపులలో ఉన్నా సురేష్ బాబు గుణశేఖర్ మీద బానే నమ్మకం ఉంచారని చెప్పుకోవాలి. బహుశా ఇదే గుణశేఖర్ కు చివరి అవకాశం కావొచ్చు. ఈ సినిమా గనుక అనుకున్న స్థాయిలో ఆడకపోతే ఆయనకు కేరీర్ కు ఇబ్బందులు తప్పవు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది, ఎవరెవరు నటిస్తున్నారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది వంటి విషయాలు తెలియాల్సి ఉంది.



