19 గిన్నీస్ రికార్డులున్న వ్యక్తి సెంట్రల్ జైలులో..!

Guru Ram Rahim Singhరేప్ కేసులో సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన‌ ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ పేరు మీద 2003 నుంచి 2015 మ‌ధ్య‌ 19 గిన్నిస్ బుక్ రికార్డులు రిజిస్ట‌రై ఉండడం గమనార్హం. 15,432 మంది ర‌క్త‌దాత‌ల‌తో క్యాంప్ ఏర్పాటు చేసి 2003, డిసెంబ‌ర్ 3న గుర్మీత్ మొద‌టి గిన్నిస్ రికార్డు న‌మోదు చేయగా, 2004లో మ‌ళ్లీ ర‌క్త‌దానంలో 17,921 దాత‌లతో పాత రికార్డును బ్రేక్ చేశారు. ఆ త‌ర్వాత 2009లో 9,38,007 చెట్లు నాటించే కార్య‌క్ర‌మంతో ద్వారా రెండు రికార్డులు, మ‌ళ్లీ 2010లో ర‌క్త‌దానంలో 43,732 దాత‌ల‌తో మ‌రో రికార్డు, 4,603 మంది ఉచిత కంటి ప‌రీక్ష‌లు చేసే క్యాంపు ఏర్పాటు చేసి ఒక రికార్డు ఆయ‌న పేరు మీద నమోదై ఉన్నాయి.

వీటితో పాటు మొక్క‌లు నాట‌డం, నాణేలు గాల్లోకి ఎగుర‌వేయడం, డాప్ల‌ర్ అల్ట్రాసౌండ్ ప‌రీక్ష‌ల క్యాంప్ నిర్వ‌హ‌ణ‌, బీపీ న‌మోదు క్యాంపు నిర్వ‌హ‌ణ‌, షుగ‌ర్ వ్యాధి చెక‌ప్ క్యాంపు నిర్వ‌హ‌ణ‌, కొలెస్ట్రాల్ ప‌రీక్ష‌ల క్యాంపు నిర్వ‌హ‌ణ‌, చేతి ప‌రిశుభ్ర‌త క్యాంపు నిర్వ‌హ‌ణ‌, ఫింగ‌ర్ పెయింటింగ్ పోటీ నిర్వ‌హ‌ణ‌, అతిపెద్ద మాన‌వహారం నిర్వ‌హ‌ణ‌, కూరగాయ‌ల‌తో బొమ్మ‌ల పోటీ నిర్వ‌హ‌ణ‌, అతి పెద్ద గ్రీటింగ్ కార్డు, పోస్ట‌ర్ వంటి 19 గిన్నిస్ రికార్డులు గుర్మీత్ సింగ్ పేరు మీద ఉండడం విశేషం. అయితే ఈయనను అత్యాచారం కేసులో దోషేన‌ని ఈ రోజు హ‌ర్యానా పంచ‌కులలోని సీబీఐ కోర్టు తీర్పు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

ADVERTISEMENT

బాబాకు కోర్టు ప్రాంగణంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి, హ‌ర్యానా పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకుని అంబాలా సెంట్ర‌ల్ జైలుకి త‌ర‌లిస్తున్నారు. దీంతో ఈ తీర్పుని జీర్ణించుకోలేని బాబా భ‌క్తులు అలజడి సృష్టిస్తున్నారు. దోషికి క‌నీసం ఏడు సంవ‌త్స‌రాల పాటు జైలు శిక్ష ప‌డుతుంద‌ని న్యాయ‌వాదులు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో, పంజాబ్, హ‌ర్యానాలలో ఆయ‌న భ‌క్తులు తీవ్ర విధ్వంసానికి పాల్ప‌డుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 17 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయాల పాలయ్యారు. నిజానికి ఈ హింస సదరు కోర్టు ప్రాంగ‌ణం వ‌ద్ద ఉన్న మీడియా వాహనాలపై దాడితోనే ప్రారంభమయ్యాయి. వారిని చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు వాటర్‌ కేన్లు, బాష్ప వాయువును ప్ర‌యోగించారు.

పంజాబ్‌లో రైల్వేస్టేషన్లు, పెట్రోల్‌ బంకుల‌కు ఆందోళనకారులు నిప్పు పెడుతున్నారు. ఆ రాష్ట్రంలోని బటిండా, మన్సా, ఫిరోజ్‌పూర్‌లో కర్ఫ్యూ విధించారు. రాష్ట్ర ప్రజలు సమయమనం పాటించాలని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. అయితే ఇంతలా ఫాలోయింగ్ కలిగిన సదరు బాబా ఏం చేసేవారంటే… డేరా సచ్చాసౌదాను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు నెలకొల్పాడు. ఆయన బోధనలకు లక్షలాది మంది ఆకర్షితులయ్యారు. ఈ సంప్రదాయంలో ఎలాంటి కులాల అడ్డుగోడలుండవు. పంజాబ్‌, హరియాణాల్లో అగ్ర కుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో లక్షలాది మంది దళితులు దీనిని స్వీకరించారు.

ప్రార్థనల కోసం నామ్‌ చర్చా ఘర్‌లను ఏర్పాటు చేశారు. డేరాల్లో సభ్యులకు సబ్సిడీతో కూడిన ఆహారధాన్యాలను సరఫరా చేస్తారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఉండే డేరాల వ‌ల్ల పేదలకు ఎంతో లాభం చేకూరుతోంది. పంజాబ్‌లోని సంగ్రూర్‌, బర్నాలా, మాన్స, భటిండా, ఫజిల్కా, ఫరీద్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌ జిల్లాల్లో డేరా వర్గీయులు అధికంగా ఉన్నారు. పంచకులలో ఆదాయపన్ను శాఖ ఆఫీసు, షాపింగ్‌ మాల్‌, ధియేటర్లపై ఆందోళ‌న‌కారులు దాడుల‌కు దిగారు. హోటల్‌ హాలీడే ఇన్‌ వద్ద నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ చెల‌రేగింది. మ‌రోవైపు ఆందోళ‌న‌కారుల నిర‌స‌న దేశ రాజ‌ధాని ఢిల్లీని కూడా తాకింది. అక్క‌డ కూడా రెండు వాహ‌నాల‌కు ఆందోళ‌న‌కారులు నిప్పుపెట్టడంతో, ఢిల్లీలోని రైల్వే స్టేషన్లు, సరిహద్దుల్లో భద్రతను పెంచారు.

ADVERTISEMENT
Latest Stories