బుధవారం నాడు తుది శ్వాస విడిచిన హరికృష్ణకు పుంగనూరు ఆవు అంటే చాలా ఇష్టమట. కృష్ణాజిల్లా, కంకిపాడు మండలం, ఈడ్పుగల్లులో శ్రీనివాసరావు అనే స్నేహితుడి ఫామ్ హౌస్‌లో మహారాష్ట్రకు చెందిన ఓ గేదెతో పాటు పుంగనూరు ఆవును కూడా పెంచుతున్నారు. వీటిని చూసేందుకు మరో మూడు రోజుల్లో వస్తానని చెప్పిన ఆయన అంతలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతున్నానని శ్రీనివాసరావు విలపిస్తూ చెప్పారు.
[m9ad]
హరికృష్ణతో శ్రీనివాసరావు కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. మూడు నెలలకోసారి హరికృష్ణ గ్రామానికి వచ్చి గోవులను చూసి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లేవారట. పుంగనూరు ఆవు ఇటీవల ఓ దూడకు జన్మనివ్వడంతో దానిని చూడడానికి వస్తానని శ్రీనివాసరావుకు చెప్పారు. పుట్టిన రోజు తర్వాత వస్తానని శ్రీనివాసరావుకు మాటిచ్చారట. అయితే, అంతలోనే ఇలా జరగడాన్ని శ్రీనివాసరావు కుటుంబం తట్టుకోలేకపోతోంది.
ఓసారి కొందరు వ్యక్తులు ఓ గేదెను కబేళాకు తరలిస్తుంటే చూసిన హరికృష్ణ వారిని అడ్డుకుని, ఆ గేదెను శ్రీనివాసరావుకు అప్పగించి, జాగ్రత్తగా చూసుకోమని చెప్పారట. ఇక తనకు ఎంతో ఇష్టమైన పుంగనూరు ఆవును తనతో పాటు హైదరాబాద్ తీసుకెళ్లాలని అనుకున్నప్పటికీ, దాని సంరక్షణ బాధ్యతలు కష్టంగా భావించిన ఆయన వెనక్కి తగ్గి శ్రీనివాసరావుకే ఆ బాధ్యతలు అప్పగించారట. సదరు సంగతులన్నీ మీడియాతో పంచుకున్నారు హరికృష్ణ సన్నిహితుడు.



