ట్రంప్ – ఇరాన్ యుద్ధం పేరుతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. నిలకడ లేని వ్యక్తులు రాజ్యాధికారంలో వస్తే దాని తాలూకా ఫలితాలు ఎలా ఉంటాయనేదానికి ట్రంప్ ఉదాంతమే చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.
ఇరాన్ తో యుద్ధం ముగిసింది, ఇక హార్మోజ్ జలసంధి ఓపెన్ అవుతుంది, సీజ్ ఫెయిర్ ఒప్పందం జరిగిపోయింది, నేను మరో పెద్ద ప్రపంచం యుద్దాన్ని ముగించేసాను అంటూ ట్రూత్ లో పోస్ట్ లు పెట్టే ట్రంప్ కు అసలు ట్రూత్ చెప్పే అలవాటే లేదా అంటూ సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడి పై సెటైర్లు పేలుతున్నాయి.
అలాగే ఇటు ఇరాన్ విషయంలో కూడా ఇన్నాళ్లుగా ఉన్న సానుభూతు ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆవిరయిపోతుంది. ఈ రెండు దేశాల కారణంగా ప్రపంచం మొత్తం యుద్ధం భయంతో అల్లాడుతోంది. ఇప్పటికి చాల చిన్న దేశాలు ఈ యుద్ధ సంక్షోభంతో ఆర్థికంగా చితికిపోతున్నాయి, ఇక భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికంగా నలిగిపోతున్నాయి.
ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం తో మొదలైన ఈ మారణకాండ ట్రంప్ ఎంట్రీ తో మరోస్థాయికి చేరుకుంది. ఇక అటు తరువాత ఆ యుద్ధం ఇరాన్ – అమెరికా అన్నట్టుగా మారిపోయింది. పొద్దున్న లేస్తే యుద్ధాలను ఆపేసాను, నేనొక శాంతి దూతను, నాకొక నోబెల్ బహుమతి కావాలని అంటూ చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం మారం చేసినట్టు చేసే ట్రంప్ తన నిలకడ లేని విధానాలతో ప్రపంచ దేశాలను ఆర్థికంగా, సామాజికంగా కోలుకోలేని దెబ్బ తీస్తున్నారు.
మరి ముఖ్యంగా ఇన్నాళ్లు అంతర్జాతీయ జలసంధిగా ఉన్న హార్మోజ్ పై ఆధిపత్యం కోసం ఇరు దేశాలు కూడా తానూ పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నటుగా మొండి పట్టుదలగా ఉన్నాయి. దీనితో ఈ ఇరు దేశాల చర్యలు ప్రతి చర్యలతో హార్మోజ్ జలసంధి వివాదం మరింత కీలకంగా మారనుంది.
సీజ్ ఫైర్ ఒప్పందంతో ఇప్పుడే చమురు కొరత నుంచి కాస్త ఉపశమనం పొందిన ప్రపంచ దేశాలు, స్టాక్ మార్కెట్ల నష్టాల నుంచి కాస్త కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు. ఇక ఇరాన్ తో సీజ్ ఫెయిర్ ముగిసిందని, ఆ దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పడంతో ఇక ఇరాన్ అమెరికా యుద్ధం మళ్ళీ మొదటికొచ్చినట్టయ్యింది.
అటు ఇరాన్ కూడా ఎక్కడ తగ్గేదెలా అన్నట్టుగా డ్రోన్లతో గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాల మీద విరుచుకుపడుతుంది. దీనితో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ కూడా బ్లడ్ బాత్ మయంగా మారిపోయాయి. ఇరాన్ – అమెరికా యుద్ధం భయంతో ఒక్కసారిగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో పాటుగా స్టాక్ మార్కెటల్ని నష్టాల బాట పట్టడంతో డాలర్ తో రూపాయి పతనం కొనసాగుతుంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ట్రంప్ ప్రకటన ల దృష్ట్యా గ్యాప్ డౌన్ తో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 1677 పాయింట్లతో, నిఫ్టీ 516 నష్టపోయి దాదాపు 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయిపోయింది. ఈ నష్టాల పరంపర ఇలానే మరికొన్ని రోజులు సాగితే భారత్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తుంది.




