ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువహీరో నిఖిల్ తన జీవిత విశేషాలను, సినీ విశేషాలను చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి రాక ముందు పార్టీలకు వెళ్లి బాగా ఎంజాయ్ చేసేవాడిని, సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనపై బాధ్యత పెరిగిందని… అలాగే తనకు ఫుట్ బాల్ ఆట ఇష్టమని, ఇంట్లో ఉంటే ఈ మ్యాచ్ లు చూస్తూ కూర్చుంటానని, లేదంటే ఫుట్ బాల్ అంటే ఆసక్తి ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ కూర్చుంటానని, ఫుట్ బాల్ తో పాటు క్రికెట్ కూడా ఇష్టమేనని అన్నాడు.
ఇక, సినిమా హీరోలలో మాస్ మహారాజా రవితేజ అంటే తనకు పిచ్చి ఇష్టమని… అమేజింగ్ యాక్టర్ అని నిఖిల్ కొనియాడాడు. తనకు తెలిసో తెలియకో రవితేజ బాడీ లాంగ్వేజ్ తన బాడీలోకి వచ్చేస్తుందని… రవితేజ నుండి చాలా స్ఫూర్తి పొందానని… అన్నీ పాజిటివ్ గా ఉంటేనే ఒక సినిమా యాక్టర్ అవొచ్చని… స్మైల్, స్టైల్ తో పాటు డెడికేషన్ ఉండాలని… హీరోలయ్యే అవకాశం చాలా అరుదుగా వస్తుందని… దానిని సద్వినియోగం చేసుకోవాలన్నదే తన తాపత్రయం అని నిఖిల్ చెప్పుకొచ్చాడు.
హీరో అవ్వాలంటే అనే దాని గురించి ఒకసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన మాటలు తాను ఎప్పటికీ మర్చిపోలేనని… ఆ మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని… “ఎన్నో కోట్ల సార్లో దేవుడికి అభిషేకాలు చేస్తేనే, గుడులు కడితేనో ఈ జన్మలో మనం హీరో అవుతాం” అని నాటి వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నాడు. అంత అదృష్టాన్ని పోగొట్టుకోవాలని తనకు లేదని, నా పూర్తి డెడికేషన్ సినిమాల పైనే ఉంటుందని ఈ సందర్భంగా తెలిపాడు.
ఇక, సినీ నటి స్వాతితో తనకు అఫైర్ ఏమీ లేదని, స్వాతి అద్భుతమైన నటి అని, మీడియాకు, అభిమానులకు ఎఫైర్స్ లాంటి స్పైసీ న్యూస్ వుంటే బాగుంటుందని చురక అంటించాడు. స్వాతి చాలా ప్రొఫెషనల్ నటి, ఆమెతో ఎప్పుడైనా ఒకసారి ఫోన్ లో మాట్లాడుతానని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి అనుబంధం లేదని అన్నాడు. గతంలో ఈ విషయంపై తామిద్దరం చాలా సార్లు వివరణ కూడా ఇచ్చుకున్నామని అన్నాడు.



