రాజధానిపై దాఖలైన పిటిషన్లను విచారిస్తోన్న హైకోర్టు తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానుల విచారణలో భాగంగా… అసలు హైకోర్టు లేకుండా కర్నూల్ లో న్యాయ రాజధాని ఏ విధంగా సాధ్యపడుతుందని ప్రశ్నించిన ధర్మాసనం… అమరావతి నుండి హైకోర్టు తరలింపు సాధ్యం కాదన్న అంశాన్ని ప్రస్తావించారు.
హైకోర్టు ప్రధాన బెంచ్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు గానూ గతంలో రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చారని, తరలింపుపై కేంద్రం మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేయనంత వరకు హైకోర్టు అమరావతి నుండి వెళ్లడం సాధ్యమయ్యే విషయం కాదని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పష్టం చేసారు. హైకోర్టు కర్నూల్ లోనే ఉండాలని వికేంద్రీకరణ చట్టంలో కూడా లేదని గుర్తు చేసారు.
గత ప్రభుత్వం తీసుకున్న అమరావతి మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్లాలని, అలాగే సీఆర్డీయే రద్దు చట్టం, వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అమరావతి అభివృద్ధికి తీవ్ర నష్టం వాటిల్లిందని పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ కోర్టుకు విన్నవించుకున్నారు.
—



