హిందూపురం టీడీపీలో సంక్షోభం క్రమంగా ముదురుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి సమావేశాలు నిర్వహించడం కానీ, అటువంటి సమావేశాలకు వెళ్లడం కానీ చేయవద్దని బాలకృష్ణ పార్టీ నేతలకు సూచించారు. అయినా బాలయ్య మాటలను ఏమాత్రం పట్టించుకోని నేతలు సమావేశమయ్యారు. బాలకృష్ణ పీఏ శేఖర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వర్గం ఆదివారం కర్ణాటక బాగేపల్లి సుంకలమ్మ ఆలయం వద్ద సమావేశం నిర్వహించింది. శేఖర్‌ను వ్యతిరేకిస్తున్న నేతలతో పాటు పలువురు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
శేఖర్‌ను వారం రోజుల్లోగా హిందూపురం నుంచి పంపించి వేయాలని సమావేశంలో తీర్మానించారు. లేదంటే పార్టీకి రాజీనామా చేసి ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దీక్ష చేస్తామని మాజీ ఎమ్మెల్యే వెంకట రాముడు, అంబికా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. అయితే అంతకు ముందే బాలకృష్ణ కొందరు నేతలకు ఫోన్ చేసి… పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అయినా వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా శేఖర్ వ్యతిరేక వర్గం సమావేశం నిర్వహించడం గమనార్హం.



