హైదరాబాద్ కు “సముద్రం” వచ్చేసిందోచ్!

hyderabad-rainsఇప్పటివరకు తెలంగాణా రాష్ట్రానికి ఉన్న ప్రధాన లోటు ‘సముద్రం’ లేకపోవడం. కానీ, నేటితో ఆ లోటు కూడా తీరిపోయింది. వరుణుడు కటాక్షించడంతో హైదరాబాద్ కు కొత్తగా సముద్రం రాకపోయినా… హైదరాబాదే సముద్రంగా మారిపోయింది. అవును… ప్రస్తుతం హైదరాబాద్ ను ఏరియల్ వ్యూ నుండి చూస్తే… ఎటు చూసినా నీరే. ఈ హాస్యాస్పదపు మాటలు పక్కనపెడితే, హైదరాబాద్ దుర్భర పరిస్థితిని చూసి రోధించడం కన్నా, ఇలా నాలుగు చమత్కారపు మాటలు చెప్తేనైనా జనాలకు కాస్త ఊరటగా ఉంటుందేమోనని భావన.

ADVERTISEMENT

గతంలో ముంబై, ముందు ఏడాది చెన్నైను చూసినపుడైనా… ముందస్తు చర్యలు తీసుకుంటారని పాలకులు భావిస్తే, ప్రజలకు అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ఇలా ఊహించని సంఘటనలు ఏర్పడినపుడు రెండు, మూడు రోజులు కాస్త హడావుడి చేయడం, మళ్ళీ ‘యధా రాజా తధా ప్రజా’ అనుకోవడం సర్వసాధారణం. విశ్వనగరంగా ప్రపంచ పటంలో చూపించాలని భావించిన తెలంగాణా సర్కార్, ప్రస్తుతం హైదరాబాద్ దుస్థితిని ప్రతిబింబించింది. కొన్ని గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే విశ్వనగరం అంతా విశాలంగా నీళ్ళు ఉంటాయని తెలిసివచ్చింది.

నగరంలో 40కిపైగా కాలనీలు వరద నీటిలో మునిగిపోగా, 100కు పైగా అపార్టుమెంటుల సెల్లార్లలో నీరు నిండిపోగా, వేలాది వాహనాల్లోకి నీరు ప్రవేశించింది. ముఖ్యంగా కూకట్ పల్లి, గచ్చిబౌలి, మెహిదీపట్నం, సనత్ నగర్ ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రాత్రి పదిన్నర గంటల నుంచి కురిసిన వర్షం తెల్లవారుజామునకు తెరిపినిచ్చినప్పటికీ, లక్షలాది మందికి కనీసం పాల ప్యాకెట్లు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో, ఇబ్బందులు మరింతగా పెరిగాయి.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ రంగంలోకి దిగి, వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చిన్న బోట్లను వినియోగిస్తున్నారు. మరోవైపు అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, భాగ్యనగరంలో వర్ష బీభత్సంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణం పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం రంగంలోకి దిగి ప్రజలకు సాయపడాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను వారికి అందించాలని, నీటిలో చిక్కుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు సైన్యం సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ప్రజల ఇబ్బందులను సాధ్యమైనంత త్వరగా దూరం చేసేందుకు గ్రేటర్ మునిసిపల్ అధికారులంతా కృషి చేయాలని అన్నారు. ఏ సమయంలోనైనా తిరిగి వర్షం మొదలు కావచ్చన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కంట్రోల్ రూంకు వచ్చే ఫోన్ కాల్స్ పై తక్షణం స్పందించేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించేందుకు సిబ్బందిని సిద్ధం చేయాలని సూచించారు.

ADVERTISEMENT
Latest Stories