ట్రాఫిక్ చలాన్ కట్టబోతే… అకౌంట్ ఖాళీ?

Traffic Challan Scam

సైబర్ నేరగాళ్ళని కట్టడి చేసేందుకు సైబర్ క్రైమ్‌ పోలీసులు ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త రకం మోసాలతో ప్రజలను దోచుకుంటూనే ఉన్నారు. వారి మోసాల గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూస్తున్నప్పుడు ‘ఏదో రోజు మనమూ మోసపోవడం ఖాయమే,’ అనే భయం కలుగుతుంది.

అయితే సైబర్ నేరాల గురించి సైబర్ క్రైమ్‌ పోలీసులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

తాజాగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల నుంచి ‘పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు’ వసూలు చేస్తుండటంతో సైబర్ నేరగాళ్ళు హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసుల పేరుతో వాహన యజమానులకు ఆన్‌లైన్‌లో నోటీసులు పంపుతున్నారు.

తక్షణమే పెండింగ్ చలాన్ల బకాయిలు క్లియర్ చేయాలని లేకుంటే వాహనాలు జప్తు చేస్తామని దానిలో హెచ్చరిస్తున్నారు. ఆ మెసేజులోనే పెండింగ్ చలాన్ల సొమ్ము చెల్లింపు కోసం ఓ లింక్ పంపిస్తున్నారు. దాని ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచిస్తున్నారు.

కానీ ఆ లింక్‌పై క్లిక్ చేస్తే వెంటనే సైబర్ నేరగాళ్ళు మన ఫోన్ హ్యాక్ చేసి దాని ద్వారా మన కాంటాక్ట్స్ తస్కరించి వారందరికీ మన తరపున మెసేజులు పంపిస్తూ డబ్బు అడుగుతారు. లేదా అశ్లీలమైన వీడియోలు పంపించి వారినీ ఉచ్చులో పడేలా చేసి వేధిస్తారు.

మరి కొందరు నేరుగా మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసేస్తారు. కనుక ఎవరికైనా ట్రాఫిక్ పోలీస్ విభాగం నుంచి ట్రాఫిక్ చలాన్ నోటీస్ వస్తే తొందరపడి లింక్ క్లిక్ చేయవద్దని హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీస్ శాఖ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించింది.

అలాగే ఇటీవల అపరిచితుల నుంచి లేదా బంధుమిత్రుల నుంచి ఆన్‌లైన్‌ పెళ్ళి లేదా శుభకార్యాలకు ఆహ్వానాలు వస్తున్నాయి. వాటిలో పెళ్ళి ముహూర్తం, వేదిక, చిరునామా వగైరా వివరాలు ఈ ‘లింక్’లో ఉన్నాయని సూచిస్తారు. ఆ లింక్ క్లిక్ చేసినా ఫోన్ హ్యాక్ అవుతుంది. అకౌంట్ ఖాళీ అయిపోతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరైతే ఈ ఆన్‌లైన్‌ మోసాల నుంచి తప్పించుకోవడం ఎలా?అంటే మంచి శక్తివంతమైన యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేసుకోవడమే.

అలాగే మీడియాలో, సోషల్ మీడియాలో ఈ ఆన్‌లైన్‌ మోసాల గురించి వచ్చే ఇటువంటి వార్తల ద్వారా మనం కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూనే ఉండాలి.

ADVERTISEMENT
Latest Stories