వరుసగా మూడు వన్డేలలో ఆసీస్ పై విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా, బెంగుళూరు వేదికగా జరిగిన నాలుగవ వన్డేలో ప్రయోగాలు చేసి ఓటమిని కొనితెచ్చుకుంది. బౌలింగ్ మొత్తాన్ని ఒకే సారి మార్చివేయడంతో ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 334 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. ఓపెనర్లు వార్నర్ (124), ఫించ్ (94) పరుగులతో చెలరేగడంతో ఒకానొక దశలో 350 పరుగులను చేస్తుందని భావించారు. అయితే ఆ తర్వాత ఉమేష్ యాదవ్ వరుసగా వికెట్లు తీయడంతో, కొంతవరకు టీమిండియా నియత్రించగలిగింది.
ఇక భారీ లక్ష్య చేధనను టీమిండియా ఓపెనర్లు కూడా గ్రాండ్ గా ఆరంభించారు. ఓపెనర్లు రెహానే (53), రోహిత్ శర్మ (65) కలిసి 106 పరుగుల శుభారంభాన్ని అందించగా, రెహనే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి మరియు రోహిత్ శర్మల మధ్య ‘కమ్యూనికేషన్’ గ్యాప్ రావడంతో, మాంచి ఊపులో ఉన్నట్లు కనిపించిన రోహిత్ శర్మ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ వెంటనే కోహ్లి కూడా (21) పరుగులకే పెవిలియన్ చేరుకోవడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ తరుణంలో ఇన్నింగ్స్ ను హార్దిక్ పాండ్య – కేదార్ జాదవ్ లు కలిసి చక్కదిద్దారు. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్న పాండ్య 41 పరుగుల వద్ద వెనుదిరగగా, జాదవ్ తో కలిసిన మనీష్ పాండే లక్ష్యం వైపుకు పరుగులు పెట్టారు. విజయం వైపుకు దూసుకెళ్తున్న తరుణంలో భారీ షాట్ కు ప్రయత్నించిన జాదవ్ అవుట్ అవ్వడంతో, ఆసీస్ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా రిచర్డ్సన్, కమ్మిన్స్ లు అద్భుతమైన బంతులతో టీమిండియా బ్యాట్స్ మెన్లను నియత్రించడంతో భారీ షాట్లకు యత్నించి వెంటవెంటనే పెవిలియన్ కు చేరుకున్నారు.
దీంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 313 పరుగులను మాత్రమే చేయడంతో, 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జయకేతనం ఎగురవేసింది. ఈ విజయంలో ఆసీస్ బౌలర్లు రిచర్డ్సన్, కమ్మిన్స్, కోల్టర్ లు కీలక భూమిక పోషించారు. వీరి అద్భుతమైన బంతులకు మహేంద్ర సింగ్ ధోని సైతం ఏమీ చేయలేని పరిస్థితి. నాలుగు వన్డేలు ముగిసే సమయానికి 3-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా, చివరి వన్డేను ఆదివారం నాడు ఆడనుంది. సెంచరీతో కదం తొక్కిన డేవిడ్ వార్నర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


