భారత్ – శ్రీలంక మధ్య జరగబోయే మూడవ వన్డేకు విశాఖపట్నం వేదిక కాబోతుంది. ఈ నెల 17న జరగబోయే ఈ మ్యాచ్ కు నగరం సిద్ధం అవుతుంది. ఈరోజు ఉదయం నుంచి టికెట్ల విక్రయం మొదలయ్యింది. నగరంలోని ఎస్ఎస్ఎన్ బ్యాకరీ-మద్దిలపాలెం, ఫ్రెష్ ఛాయిస్-వాల్తేర్, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం- వన్ టౌన్, పోలీస్ బారక్స్- జగదాంబ దగ్గర మ్యాచ్ టికెట్లను విక్రయించనున్నారు.
మరోవైపు మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 తో వెనుకబడి ఉంది. మొదటి వన్డేలో శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్ జట్టు ప్రతీకారంతో రగిలిపోతుంది. రేపు మొహాలీ లో జరగనున్న రెండవ వన్డే కీలకంగా పరిణమిస్తుంది. సిరీస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం భారత్ కు కీలకం.
రెండవ మ్యాచ్ మన జట్టు గెలిస్తే విశాఖలో జరగనున్న మూడవ మ్యాచ్ ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటిదాకా ఈ విశాఖలో మన జట్టు ఏడు మ్యాచ్లు అడగగా అందులో ఐదు గెలుపొందింది. ఒక మ్యాచ్ జరగకపోగా, ఇంకోటి వెస్ట్ ఇండీస్ చేతిలో ఓడిపోయింది. శ్రీలంక తో ఇక్కడ ఒక మ్యాచ్ ఆడగా భారీ విజయం సాధించింది.



