రికార్డులు వస్తున్నాయి… పట్టించుకునేవారేరి..?

India vs West Indies, 2nd ODIఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో పాకిస్తాన్ చేతిలో ఓటమిని చవిచూసిన టీమిండియా, ఆ వెనువెంటనే వెస్టీండీస్ జట్టుతో సిరీస్ కు సిద్ధమైపోయింది. తొలి మ్యాచ్ లో భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తున్న టీమిండియాకు వరుణుడు రూపంలో అడ్డు తగలడంతో పూర్తిగా రద్దు కాగా, రెండవ మ్యాచ్ కు కాస్త కనికరించడంతో 43 ఓవర్ల పాటు మ్యాచ్ సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏకంగా 310 పరుగులు చేసారు. టాప్ 3లో రెహనే (103), శిఖర్ ధావన్ (63), విరాట్ కోహ్లి (87) చెలరేగడంతో భారీ స్కోర్ నమోదైంది.

ADVERTISEMENT

ఇక లక్ష్య చేధనలో విండీస్ జట్టు ఏ దశలోనూ పోరాటపటిమను ప్రదర్శించ లేకపోయింది. తొలి ఓవర్లోనే ఒక ఓపెనర్ పెవిలియన్ చేరుకోగా, మరో ఓపెనర్ హోప్ (81) ఒంటరి పోరాటం చేసి విండీస్ పరువు దక్కించేలా చేసాడు. దీంతో నిర్ణీత 43 ఓవర్లలో కేవలం 205 పరుగులు మాత్రమే చేయడంతో, 105 పరుగుల తేడాతో టీమిండియా విజయం సొంతం చేసుకుని సిరీస్ లో 1-0తో ముందంజలో నిలిచింది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, కులదీప్ 3 వికెట్లను సొంతం చేసుకోగా, అశ్విన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.

విజయమైతే సొంతమయ్యింది కానీ, నిజంగా ఈ మ్యాచ్ లను క్రికెట్ అభిమానులు చూస్తున్నారా? అంటే ప్రశ్నార్ధకమే. నిజానికి చాలా మందికి ఇలా విండీస్ తో ఒక సిరీస్ జరుగుతుందని కూడా తెలియదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీనికి ప్రధాన కారణం ఫైనల్స్ లో ఓటమి కాగా, మరొకటి విండీస్ జట్టు. బలమైన టీమిండియా ముందు విండీస్ గెలవడం అసాధ్యం కనుక, దీనికి ప్రాధాన్యత లేకుండా పోయింది. అందులోనూ మ్యాచ్ ప్రసారమయ్యే టైమింగ్స్ కూడా ఇండియన్స్ కు అనుకూలమైనవి కాకపోవడం మరో పాయింట్.

అయితే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఇప్పటివరకు 300 పరుగులకు పైగా స్కోర్ ను నమోదు చేసిన జట్లల్లో టీమిండియా అగ్ర స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాఇప్పటివరకు 95 మ్యాచ్ లలో 300కు పైగా స్కోర్లను నమోదు చేయగా, తాజా మ్యాచ్ తో టీమిండియా ఆసీస్ ను అధిగమించి ఆ సంఖ్యను 96కు పెంచింది. ఆ తర్వాత స్థానాల్లో దక్షిణాఫ్రికా 77, పాకిస్తాన్ 69, శ్రీలంక 63, ఇంగ్లాండ్ 57, న్యూజిలాండ్ 51 మ్యాచ్ లలో 300కు పైగా స్కోర్లను నమోదు చేసాయి.

ADVERTISEMENT
Latest Stories