ఇటీవల ఇంగ్లాండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ లో ఆపసోపాలు పడిన టీమిండియాకు, ప్రస్తుతం రాజ్ కోట్ వేదికగా వెస్టీండీస్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కేక్ వాక్ లా ఉంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, 649 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. పృధ్వీషా, కోహ్లి, జడేజాలు సెంచరీలతో చెలరేగగా, పుజారా, పంత్ లు సెంచరీలను మిస్ చేసుకున్నారు.
[m9ad]
ఇక తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్ బ్యాట్స్ మెన్లకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. రెండవ రోజు 29 ఓవర్లు ఆడిన విండీస్ 94 పరుగులు చేసి 6 వికెట్లను కోల్పోయింది. ఇంకా 555 పరుగుల దూరంలో ఉండగా, చేతిలో కేవలం 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఎలా చూసుకున్నా, టీమిండియా మరో ఇన్నింగ్స్ ఆడకుండానే మ్యాచ్ ముగిసేలా కనపడుతోంది.
కెరీర్ లో 123వ ఇన్నింగ్స్ ఆడుతోన్న కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించడం ద్వారా, అంతకుముందు సచిన్ పేరిట ఉన్న (125 ఇన్నింగ్స్ లలో 24 సెంచరీలు) రికార్డును బద్దలు కొట్టాడు. రిషబ్ పంత్ విషయానికి వస్తే కెరీర్ ను సిక్స్ తో ఆరంభించిన పంత్, మొదటి సెంచరీని సిక్స్ తో పూర్తి చేయగా, నేడు హాఫ్ సెంచరీని సిక్స్ తో ముగించాడు. అలాగే సిక్స్ కోసమే ప్రయత్నించి పెవిలియన్ చేరుకున్నాడు.



