సామాన్యుల ప్రజల నడ్డి విరిచేలా రైల్వే బడ్జెట్?

Indian Railway Budgetsభారతదేశ చరిత్రలో తొలిసారిగా సాధారణ బడ్జెట్ తో కలిసి రైల్వే బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రానున్న వేళ, రైలు ప్రయాణికులపై చార్జీల భారం మోపడం ఖాయమని మీడియా వర్గాలలో ప్రచారం జరుగుతోంది. సాలీనా 20 శాతం వృద్ధితో 1.45 లక్షల కోట్లకు విస్తరించిన భారత రైల్వేల్లో ఇప్పటికీ లాభాల్లోకి నడవాల్సిన విభాగాలు ఎన్నో ఉండగా, ఈ దఫా బడ్జెట్ లో రైల్వే టికెట్ ధరలను స్వల్పంగానైనా పెంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్టు ఐడీబీఐ కాపిటల్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ తెలిపారు.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొత్త రైళ్ల ప్రతిపాదనలు ఉండకపోవచ్చని, ప్లాట్ ఫాం టికెట్ ధరలతో పాటు, లోకల్ రైళ్లు, సెకండ్ క్లాస్ టికెట్ ధరల పెంపూ ఉండవచ్చని అంచనా వేశారు. ఇక గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న రైల్వే సెక్టార్ సంబంధిత కంపెనీలు ఈ బడ్జెట్ తరువాత అమ్మకాల ఒత్తిడిలోకి వెళ్లవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రైల్వే చార్జీల పెంపు అనివార్యం అయిన పక్షంలో, ప్రతిపక్షాలకు మోడీ సర్కార్ మరో ఆయుధం ఇచ్చినట్లేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT

హింద్ రెక్టిఫయర్స్, టిమ్ కెన్ ఇండియా, బీఈఎంఎల్, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, టిటాగఢ్ వాగన్స్, టెక్స్ మాకో రైల్, కాళిందీ రైల్ వంటి కంపెనీలు డిసెంబర్ 26 నుంచి జనవరి 27 మధ్య 3 నుంచి 28 శాతం వరకూ వృద్ధిని సాధించగా, ఈ కంపెనీలు బడ్జెట్ డే నాడు నష్టాల్లోకి జారిపోవచ్చని భావిస్తున్నారు. మొత్తమ్మీద పెద్ద నోట్ల రద్దు తర్వాత అంతటి సంచలనం సృష్టించే విధంగా మోడీ సర్కార్ రైల్వే చార్జీల పెంపుకు శ్రీకారం చుట్టవచ్చని ఢిల్లీ వర్గాల టాక్.

ADVERTISEMENT
Latest Stories