తెలంగాణవాళ్ళకి పరిపాలన చేతకాదని సర్టిఫికేట్ ఇచ్చిన మన రాజకీయ నాయకులు ఇప్పుడు చేస్తున్నదేమిటి? అప్పులపాలైన రాష్ట్రాన్ని నడిపించేందుకు ప్రతీనెల మొదటివారంలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి కేంద్రాన్ని ప్రాదేయపడవలసి వస్తోంది. ఓ పక్క ప్రభుత్వం కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు, ఇంటి పన్నులు పెంచేస్తుంటే మరోపక్క రోజురోజుకీ ధరలు పెరిగిపోతున్నాయి. ఇవి సరిపోవన్నట్లు పరిశ్రమలకు పవర్ హాలీడేస్, అనధికార కోతలు అమలవుతుండటంతో అవీ నడుపలేని పరిస్థితి నెలకొంది.
ఇదివరకు కరోనా, లాక్‌డౌన్‌తో మూతపడి తీవ్రంగా నష్టపోయిన ఏపీలోని పరిశ్రమలు, మెల్లగా పుంజుకొంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పవర్ హాలీడేస్ పేరిట వారానికి రెండు రోజులు, ఇవి సరిపోవన్నట్లు రోజూ అనధికార విద్యుత్ కోతలు అమలుచేస్తుండటంతో పరిశ్రమలు నడిపించలేని పరిస్థితి ఏర్పడింది. అవీ మూతపడితే వాటి ద్వారా వచ్చే ఆదాయం తగ్గడమే కాకుండా వాటిలో పనిచేసే వేలాది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా ఏపీలో గ్రానైట్, సిమెంట్, ఉక్కు, బట్టలు, పెయింట్స్ కమ్ప్నీలు, పారిశ్రామికవాడలలోని చిన్న పరిశ్రమలు, వర్క్ షాపులు విద్యుత్ కోతలతో నడిపించలేక మళ్ళీ తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి.
ఇక్కడ ఏపీలో పరిశ్రమలు నడిపించలేని దుస్థితి నెలకొని ఉంటే, ఇదే సమయంలో పొరుగున తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ నెల సగటున రూ.200 కోట్లు పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఇటీవలే సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజస్ పార్కులో గుజరాత్‌కు చెందిన సహజానంద మెడికల్ టెక్నాలజీస్ రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన స్టెంట్స్ పరిశ్రమను ఈనెల 15న ఆ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేయడమే ఇందుకు తాజా ఉదాహరణ.
తెలంగాణకు వేలకోట్లు పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, పరిశ్రమలు ఎందుకు వస్తున్నాయి?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు రావడం లేదు?తెలంగాణలో లేని విద్యుత్ కొరత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు ఉంది? ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు మూతపడితే ఏపీ పరిస్థితి ఏమిటి?అని ప్రజలు కాదు…పాలకులే ప్రశ్నించుకోవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ఇప్పుడు తెలంగాణలో గల్లీ స్థాయి నేతలు కూడా నవ్వుతున్నారంటే నవ్వరా మరి!



