అవును… మీరు వింటున్నది నిజమే… నాచురల్ స్టార్ నాని తాజా సినిమా “నిన్ను కోరి” విడుదల కోసం ఇండస్ట్రీకి సంబంధించిన బిగ్ షాట్స్ దగ్గుపాటి సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దగ్గుపాటి సురేష్ బాబే వెల్లడించారు. దేశంలో అమలవుతున్న కొత్త పన్ను విధానం జీఎస్టీ అమలైన తర్వాత విడుదల కానున్న మొదటి సినిమా నానిదే కావడంతో, ఈ సినిమా రిలీజ్ కోసం తామంతా ఎదురు చూస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పన్ను విధానాలు సమూలంగా మారనున్న నేపధ్యంలో… ఇది తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదని, ఇండస్ట్రీ భవిష్యత్తు అసలు ఎలా ఉంటుంది? ఏంటి? అన్నది ఈ “నిన్ను కోరి” విడుదల తర్వాతే తేలనుంది అంటూ దగ్గుపాటి సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో జీఎస్టీ ప్రభావం సినీ ఇండస్ట్రీ మీద కూడా ఓ స్థాయిలోనే పడనుందన్న సంకేతాలను సురేష్ బాబు పంపించారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ధియేటర్లలో టికెట్ల ధరలు భారీగా పెరగనుండడంతో ప్రేక్షకులు ఎంతమేరకు ధియేటర్లకు విచ్చేస్తారో చూడాలి.
అయితే నాని మాత్రం… ఒట్టేసి చెప్తున్నా… ‘నిన్ను కోరి’ సినిమాను మీతో పాటు మీ ఇంటికి తీసుకువెళ్తారు, అంత ఫీల్ గుడ్ మూవీ ఇది. సాధారణంగా నా సినిమాలు అలా ఉంటాయి, ఇలా ఉంటాయి అని చెప్పడం నాకు అలవాటు లేదు, కానీ ‘నన్ను నమ్మండి…’ ఈ సినిమా మాత్రం మంచి అనుభూతులను మిగుల్చుతుంది అంటూ విజయం పట్ల పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఈ సినిమా గురించి ఇప్పుడేం చెప్పినా మీకు ఎక్కువ అనిపిస్తుంది, కానీ రిలీజ్ తర్వాత చెప్తే తక్కువగా ఉంటుంది, అందుకే మిగతావన్నీ రిలీజ్ తర్వాత మాట్లాడతాను అంటూ ముగించారు నాని.



