తమ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ మేలు చేసిందని, హామీలన్నీ నెరవేర్చిందని కనుక ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని సిఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు సభలలో చెప్పుకొంటుంటారు. అయితే ఆయన మాట్లాడుతుండగానే జనాలు గోడలు దూకి పారిపోతుంటారు. అది వేరే విషయం. రాష్ట్రంలో ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారా లేదా తెలుసుకొనేందుకు చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు గ్రామం గీటురాయిగా తీసుకొంటే వాస్తవం అర్దమవుతుంది.
పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తన నియోజకవర్గంలో మండలంపేట అగ్రహారంలో గడప గడపకి కార్యక్రమం పెట్టుకొని మందిమార్బలాన్ని వెంటేసుకొని వచ్చారు. కానీ గ్రామంలో ఇళ్ళన్నీ తాళాలు వేసి ఉండటంతో ఆయన షాక్ అయ్యారు. ఆయన వస్తున్నారని తెలిసి గ్రామస్తులు అందరూ ఇళ్ళకు తాళాలు వేసి పోరుగూరుకి వెళ్ళిపోయారు. గత నాలుగేళ్ళుగా తమ గ్రామంలో సమస్యల గురించి ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు తనకు ఓట్లు వేయమని అడిగేందుకు వస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో చెప్పుకొన్నా ప్రయోజనం ఉండదు కనుకనే ఇళ్ళకు తాళాలు వేసి వచ్చేసి నిరసన తెలియజేశామని గ్రామస్తులు చెప్పారు.
అయితే ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకి ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవడం ఇదే మొదటిసారి కాదట. నియోజకవర్గంలో ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రజలు అడ్డుకొని నిలదీస్తున్నారు. ఇటీవల అమ్మగారిపల్లెలో గడప గడపకి వెళ్లినప్పుడు తమ ఊర్లో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ గ్రామస్తులు అడ్డుకొని తిప్పి పంపించేశారు. ఇది ఈయన ఒక్కరే ఎదుర్కొంటున్న సమస్య కూడా కాదు. వైసీపీలో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్లిన్నప్పుడు ప్రజల నుంచి ఛీత్కారాలు, నిలదీతలు దాంతో వారు ప్రజలపై ఆగ్రహావేశాలు ప్రదర్శించి వెనుతిరిగిపోతున్న ఘటనలకు సంబందించి వార్తలు మీడియాలో వస్తున్నాయి కదా?ఆర్యా సినిమాలో హీరో అల్లు అర్జున్ తనను చీదరించుకొంటున్న హీరోయిన్ వెంటపడుతూ “నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో… చెలియా ఫీల్ మై లవ్,” అంటూ పాడుకొన్నట్లే, ప్రజలు ఛీ కొట్టి తిట్టుకొంటున్నా నిత్యం మనల్నే తలుచుకొంటునందుకు సంతోషించాలన్నట్లుంది వైసీపీ నేతల తీరు.



