ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సచిన్ టెండూల్కర్ టీం ముంబై ఇండియన్స్ ఈ వారంలో రెండు కీలక మ్యాచ్ లను ఆడనుంది. ఒకటి బుధవారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో కాగా, మరొకటి శుక్రవారం నాడు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో తలపడనుంది. ముంబై ఆడనున్న ఈ రెండు మ్యాచ్ లలో ఇప్పటికే హైదరాబాద్ జట్టు రెండు విజయాలతో మంచి ఊపులో ఉండగా, బెంగుళూరు జట్టు రెండు ఓటములతో ఎలాగైనా గెలవాలనే కసిగా ఉంది.
వీటికి తోడు హైదరాబాద్, బెంగుళూరు రెండు జట్లల్లోనూ ఇద్దరు కీలక ఆటగాళ్ళు జట్టులోకి రాబోతున్నారు. ముందుగా హైదరాబాద్ జట్టు, తమ తురుపుముక్క బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ ను బుధవారం నాటి మ్యాచ్ లో బరిలోకి దింపనుంది. ముస్తఫిజుర్ వికెట్లు తీయడంలోనే కాదు, పరుగులను కట్టడి చేయడంలో కూడా దిట్ట అన్న విషయం తెలిసిందే. దీంతో బుధవారం నాటి మ్యాచ్ లో ముంబై బ్యాట్స్ మెన్లకు ఈ సన్ రైజర్స్ బౌలర్ చుక్కలు చూపిస్తారనే నమ్మకంతో జట్టు సభ్యులు ఉన్నారు.
ఇక, ఒక్క బెంగుళూరు జట్టు మాత్రమే కాకుండా, క్రికెట్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లి కూడా, ముంబై ఇండియన్స్ తోనే ఈ ఏడాది ఖాతాను ఓపెన్ చేయాలని నిర్ణయించుకోవడం ముంబైకు ప్రతికూల అంశమే. ఇప్పటికే డివిలియర్స్ విధ్వంసం జట్టులో ఉండగా, ఇప్పుడు కోహ్లి కూడా చేరితే, ఆ జట్టు విజయానికి అడ్డు ఉండకపోవచ్చు అనేది బెంగుళూరు జట్టు అభిమానుల మాట. వీరిద్దరూ కూడా ముంబై ఇండియన్స్ మ్యాచ్ లతోనే రావడం సచిన్ ఫ్యాన్స్ కు కొంత నిరుత్సాహం కలిగించే విషయమే.


