ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆరోపణలు ఎంతటి కుదుపును కుదిపాయో అన్న విషయం తెలిసిందే. వీటి ప్రభావంతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు గత రెండేళ్ళుగా ఐపీఎల్ కు దూరమయ్యాయి. నిషేధం విధించిన ఈ రెండు జట్లు వచ్చే ఏడాది ఐపీఎల్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్ లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాలు వెలుగు చూడడం విశేషం.
సురేష్ రైనా సారధ్యంలో కొనసాగుతోన్న గుజరాత్ లయన్స్ జట్టులో ఇద్దరు క్రీడాకారులు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని, ఇందుకు గాను ఒక్కో ఆటగాడికి దాదాపుగా 40 లక్షల రూపాయలు ముట్టినట్లుగా పోలీస్ వర్గాలు వెల్లడించాయి. సదరు సమాచారాన్ని బీసీసీఐకు ఇచ్చిన పోలీసులు, క్రీడాకారుల పేర్లు మాత్రం బహిర్గతం చేయలేదు. ప్రస్తుతం ముగ్గురు బుకీలు తమ అదుపులోనే ఉన్నారని, వారి నుంచి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని పోలీసులు స్పష్టం చేసారు.
ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నామని బీసీసీఐ పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకూ ఆటగాళ్ల పేర్లను బయటకు వెల్లడించబోమని బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ సీజన్ ముగింపు దశకు చేరుకునే పాటికి వెలుగు చూసిన ఈ ఉదంతం పక్కన పెడితే, గుజరాత్ లయన్స్ జట్టు 7వ స్థానంలో నిలిచి, టోర్నీ నుండి ఇప్పటికే వైదొలగిన విషయం తెలిసిందే. అంటే గుజరాత్ 7వ స్థానానికి పడిపోవడం వెనుక ఆ ఇద్దరు క్రీడాకారుల ‘హస్తం’ ఉందన్న చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ “ఆ ఇద్దరు” ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది.


