మంగళవారం సాయంత్రంలోగా ఇరాన్ ప్రభుత్వం హోర్మూజ్ జలసంధి బేషరతుగా తెరిచి చమురు, గ్యాస్, సరుకు రవాణా నౌకలను అనుమతించాలని, 45 రోజులు కాల్పులు విరమణ ప్రకటించి శాంతి చర్చలకు రావాలని లేకుంటే ఈరోజు రాత్రి కాళరాత్రి అవుతుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తుది హెచ్చరిక చేశారు.
కానీ ఆయన హెచ్చరికని, గడువుని, కాల్పులు విరమణ ప్రతిపాదనని ఇరాన్ నిర్ద్వందంగా తిరస్కరించింది. యుద్ధం పూర్తిగా నిలిపివేయడం తప్ప మరేదీ తమకు సమ్మతం కాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఇరాన్ మౌలిక వసతుల మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తే, ప్రతీకార చర్యలకు అవి కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
ఇరాన్ జవాబు ట్రంప్ అహాన్ని దెబ్బతీసి రెచ్చగొట్టేలా ఉంది. ఆయన విధించిన గడువు కూడా ముగిసింది. ఇరాన్ ప్రభుత్వం హోర్మూజ్ జలసంధిని తెరవలేదు కూడా. కనుక ట్రంప్ ముందు రెండే మార్గాలున్నాయి. 1. ఇరాన్ విద్యుత్, చమురు కేంద్రాలపై దాడులు చేసి, ఇరాన్ ప్రతీకార దాడులను ఎదుర్కోవడం. 2. మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాల మాట విని 45 రోజులు కాల్పులు విరమణ ప్రకటించడం.
ట్రంప్ ఇంత పెద్ద పదవిలో ఉన్నప్పటికీ మాట నిలకడలేక పోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ట్రంప్ ఇంత వయసులో కూడా చాలా అనాలోచితంగా, దుందుడుకుగా వ్యవహరిస్తూ అమెరికాకి, ప్రపంచ దేశాలకు కూడా కొత్త సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు.
కనుక ఏ క్షణంలో ఆయన ఆలోచన ఏవిధంగా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఒకవేళ ఇరాన్ ప్రజల ప్రాణాల కంటే తన అహమే ముఖ్యమని భావిస్తే ముందే హెచ్చరించినట్లు ఈరోజు రాత్రి ఇరాన్‌కి కాళరాత్రిగా మారుతుంది. ఇంత చేసినా హోర్మూజ్ జలసంధిని తెరిపించలేకపోతే పరువు పోతుందని గ్రహిస్తే మరోసారి గడువు పొడిగించవచ్చు.
కనుక ఇరాన్ భవిష్యత్ ట్రంప్ చేతిలో ఉందిప్పుడు. మరికొన్ని గంటలలో ఏం జరుగబోతోందో… చూసి తెలుసుకోవాల్సిందే!






