కరోనా గురించి తెలియదు ఓకే… ఇరాన్‌ యుద్ధం గురించి ముందే తెలుసుగా?

Fuel pumps, LPG cylinders and closed hotels symbolizing fuel and gas crisis fears in India due to Iran war tensions

కరోనా ఓ మహమ్మారిలా యావత్ ప్రపంచం మీద విరుచుకుపడుతుందని ఎవరూ ఊహించలేదు. అది ఎవరి తప్పూ కాదు. కానీ లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత గానీ మన దేశంలో వైద్యవిధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం కాలేదు.

కరోనా పుణ్యామాని ప్రభుత్వాలు అనేక కొత్త పాఠాలు నేర్చుకోగలిగాయి. లోపాలను సవరించుకుని వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నాయి.

ADVERTISEMENT

ప్రభుత్వమంటే ఓ ప్రధాని, ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు… ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, అనేక శాఖాధిపతులు, లక్షలాది మంది ఉద్యోగుల అతి పెద్ద సమిష్టి యంత్రాంగం కదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో అన్ని రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా ఉంటారు.

ఇంతమంది చేతిలో ఉన్నప్పటికీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే, నిత్యావసర సరుకులు, కూరగాయలు కొరత ఏర్పడితే ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఎటువంటి ముందస్తు ప్రణాళికలు, ఏర్పాట్లు చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇరాన్‌ యుద్ధమేమీ అకస్మాత్తుగా మొదలవలేదు. ట్రంప్‌ అధికారంలోకి రాగానే మొదట ఆర్ధిక యుద్ధాలు, తర్వాత దౌత్య యుద్ధాలు చేశారు. ఇప్పుడు సైనికులు, ఆయుధాలతో యుద్ధాలు చేస్తున్నారు. ట్రంప్‌ ధోరణితో వరుసగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న తర్వాత కూడా ఇలాంటి అత్యవసర పరిస్థితులకు భారత్‌ సిద్ధంగా లేదంటే ఎవరిది తప్పు?

అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని, అప్పుడు దేశంలో సంక్షోభం ఏర్పడుతుందని ముందే ఊహించి ముందస్తు ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోవాలి కదా?

చిన్న తుఫాను వస్తోందంటేనే సామాన్య ప్రజలు అత్యవసరమైనవని కొని తెచ్చి పెట్టుకుంటారు. మరి 140 కోట్లు పైగా జనాభా ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు ఏం చేపట్టలేదని మూత పడుతున్న హోటల్స్, టిఫిన్ సెంటర్స్ చెపుతున్నాయి. అవి మూతపడితే వాటిలో పని చేస్తున్న లక్షలాది మంది రోడ్డున పడతారు.

రేపు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే ముందుగా సరుకు రవాణా, తర్వాత ప్రజా రవాణా వ్యవస్థపై పడుతుంది. సరుకు రవాణాపై అదనపు భారం పడితే నిత్యావసర సరుకులు, కూరగాయలు ధరలు పెరుగుతాయి. ఓ వైపు నిరుద్యోగం, మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతుంది.

ఈ యుద్ధం ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే ఈ ఇబ్బందులు పెను సమస్యలుగా మారుతాయని వేరే చెప్పక్కరలేదు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయా?లేక పెద్దనోట్ల రద్దు, లాక్ డవున్‌లాగే చేతులెత్తేస్తాయా?

ADVERTISEMENT
Latest Stories