జగన్‌, కేసీఆర్‌లను కేంద్రం కాపాడుతోందా? ఎందుకు?

Centre protecting Jagan KCR

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అక్రమాస్తుల కేసులు దాదాపు 15 ఏళ్ళుగా కోర్టులలో నడుస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు దాదాపు 6 ఏళ్ళుగా నడుస్తోంది.

తాజాగా మద్యం కుంభకోణం కేసులో కూడా జగన్‌ హ్యాండ్ ఉందని సిట్ అధికారులు చెపుతున్నారు. ఈ కేసులో ఆయనే అంతిమ లబ్దిదారు… ఆయనే ‘బిగ్ బాస్’ అని చెపుతున్నారు.

ADVERTISEMENT

ఈ మూడు కేసులలో ఇంతవరకు జగన్‌ని ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు! కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేయడానికి జగన్‌ ఎవరి అనుమతీ తీసుకోలేదు. అరెస్ట్‌ చేయడానికి పెద్దగా సంకోచించలేదు!

జగన్‌పై ఇన్నేళ్ళుగా ఇన్ని కేసులు సాగుతున్నప్పటికీ సీబీఐ, ఈడీలు దోషిగా ఎందుకు నిరూపించలేక పోతున్నాయి? ఎందుకు శిక్ష పడేలా చేయలేకపోతున్నాయి?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విలువ వంద కోట్లు. ఆ కేసులో కేంద్రం ఢిల్లీ సిఎం, మాజీ సిఎం, కల్వకుంట్ల కవితతో సహా పలువురిని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టింది. కాగా రూ.3,500 కోట్ల ఏపీ మద్యం కుంభకోణం కేసుని సీబీఐ, ఈడీలు కన్నెత్తి చూడటం లేదు! ఎందుకు? అనే ప్రశ్నకు సీపీఐ నారాయణ సమాధానం చెప్పారు.

ఎన్డీయేలో టీడీపి, కూటమి ప్రభుత్వంలో బీజేపి భాగస్వాములుగా ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి పట్ల మోడీ, అమిత్ షాల మనసులో ఇంకా చోటు ఉందన్నారు. అలాగే జగన్‌ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళకపోయినా వారిరువురితో ‘టచ్’లోనే ఉన్నారని నారాయణ అన్నారు. అందుకే జగన్‌పై ఏ కేసులు ముందుకు సాగడం లేదన్నారు.

అందుకే సీబీఐ, ఈడీలు ఏపీ మద్యం కుంభకోణం కేసువైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఈ కేసులో అరెస్ట్‌ అయ్యి జైల్లో చిప్పకూడు తింటుండేవారని నారాయణ అన్నారు.

నారాయణ వాదనల నేపధ్యంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కొంత కాలం చేసిన ఓ ఆరోపణ గుర్తుచేసుకోక తప్పదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ని అరెస్ట్‌ చేయకుండా కేంద్రం అడ్డుపడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఇప్పుడు సీపీఐ నారాయణ కూడా అదే చెపుతున్నారు కదా? అక్కడ కేసీఆర్‌ని, ఇక్కడ జగన్‌ని అరెస్ట్‌ చేయకుండా కేంద్రం అడ్డుపడుతోందనే వారి ఆరోపణలను కొట్టి పారేయలేము. కానీ ఎందుకు? అనే సందేహం కలుగుతుంది.

భారత్‌కు ప్రశాంతత లేకుండా చేస్తూ, అభివృద్ధి చెందకుండా నిరోదించేందుకు భారత్‌కు పక్కలో బల్లెంలా చైనా, పాకిస్తాన్లను అమెరికా ప్రోత్సహిస్తుంటుంది. తద్వారా భారత్‌ ఎప్పటికీ అమెరికాపై ఆధారపడి ఉండేలా చేసుకుంటుంది. చైనా, పాకిస్తాన్ వల్ల ప్రమాదం పొంచి ఉన్నంత కాలం అమెరికా తయారు చేసిన యుద్ధ విమానాలను, ఆయుధాలను భారత్‌కి అమ్ముకోగలదు. లక్షల కోట్లు సంపాదించుకోగలదు.

ఇదేవిదంగా ఏపీలో టీడీపికి, తెలంగాణలో కాంగ్రెస్‌కి పక్కలో బల్లెంలా జగన్‌, కేసీఆర్‌ ఉండటం చాలా అవసరమని కేంద్రం భావిస్తుండవచ్చు.

శాసనసభ ఎన్నికలలో జగన్‌ని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు బీజేపితో పొత్తుకు సిద్దపడి మోడీ, అమిత్ షాల సాయం కోరారు కదా?

అలాగే చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పెట్టే కేసులను తట్టుకోవడానికి, ఆయనని ఎదుర్కోవడానికి, పాత కేసుల నుంచి ఉపశమనం కోసం జగన్మోహన్ రెడ్డి వినయంగా పడి ఉంటారు.

కనుక ఒకరికొకరికి పక్కలో బల్లేలు బలంగా ఉంచడం చాలా అవసరం. బహుశః ఇందుకే కేంద్రం జగన్‌, కేసీఆర్‌ జోలికి ఎవరూ వెళ్ళకుండా కాపాడుకుంటుండవచ్చు.

బహుశః ఇదే ధైర్యంతో జగన్‌, కేసీఆర్‌ (కేటీఆర్‌)లు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిపై ఇంతగా రెచ్చిపోతున్నారేమో?

ఈ లెక్కన ఎవరు ఎంత అవినీతికి, అక్రమాలకూ పాల్పడినా శిక్షలు పడకుండా హ్యాపీగా రాజకీయాలు చేసుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories