
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఉపముఖ్యమంత్రి గా, పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం శాఖ మంత్రిగా పూర్తిగా ప్రభుత్వంలో భాగమయ్యారు.
మొదటి సారిగా ఎమ్మెల్యే గా గెలిచిన వ్యక్తి ఇటు ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషించే ఈ ఐదు శాఖలతో పాటుగా అటు ఉపముఖ్యమంత్రి గా, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గా పని చేయడం అంటే అంత సులభతరమైన విషయం కాదు.
Also Read – అందరి చూపు, నాని HIT వైపే
అలాగే వీటికి తోడు ఇటు తనకు, తన పార్టీకి ఆదాయ మార్గమైన సినిమాలను కూడా వదులుకోవడం లేదు పవన్. అంటే ఇటు రాజకీయంలోనూ అటు సినీ పరిశ్రమకు సంబంధించి రెండు రంగాలలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పవన్ తన అన్ని బాధ్యతలకు పూర్తి న్యాయం చేయగలుగుతున్నారా.?
ఇటు సినీ పరిశ్రమ విషయానికి వస్తే గత ఏడాదే విడుదలకు నోచుకోవాల్సిన హరిహర వీరమల్లు ఇప్పటికి సెట్స్ లోనే మగ్గుతుంది. జగన్ విశాఖే రాజధాని అంటూ పండుగల పేర్లు చెప్పి కాలక్షేపం చేసినట్టు హరిహర వీరమల్లు కూడా విడుదల తేదీలను మార్చుకుంటూ చివరికి ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో, ఒక వేళ వచ్చినా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో అన్న అనుమానాలు పవన్ అభిమానులను సైతం వెంటాడేలా చేస్తున్నాయి.
ఇక పవన్ ఎక్కడికి వెళితే అక్కడ అది రాజకీయ ప్రసంగమైన, పరామర్శ యాత్రయినా సమయం ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా OG, OG అంటూ పవన్ ను చుట్టూ ముడుతున్న అభిమానుల అత్యుత్సహం పవన్ కూడా భయపెట్టే స్థాయికి వెళ్లిపోయిందని చెప్పాలి. అటు OG సినిమా పై ఇంటా బయట ఏర్పడిన ఈ హైప్ ను నిర్మాతలు కానీ దర్శకుడు కానీ సరైన సమయంలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అనే వాదన కూడా సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది.
పవన్ సినిమా సమస్యలు ఇలా ఉంటే ఇక రాజకీయాల విషయానికొస్తే ఇక్కడ పరిస్థితి అంతకన్నా దారుణమనే చెప్పాలి. మొదటిసారిగా ఎమ్మెల్యే గా గెలవడంతో పూర్తిగా పాలనా పరమైన అంశాలలో అవగాహనా లేకపోవడం, ప్రతిదీ కొత్తగా నేర్చుకోవడంతో పవన్ కు తన శాఖల మీద పట్టు సాధించడానికి కాదు పూర్తిగా అధ్యాయనం చేయడానికే చాల ఎక్కువ సమయం పట్టింది.
అందునా పవన్ తీసుకున్న పంచాయితీ రాజ్ శాఖ ఇతర శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సి వస్తుంది. అయితే పవన్ చిత్తశుద్ధి లోపం లేకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఆసక్తి కనపరుస్తున్నారు, అలాగే 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న బాబు నాయకత్వంలో పని చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ బహిరంగ ప్రకటనలు చేస్తూ నిత్యా విద్యార్థినే అనే భావనలో పని నేర్చుకుంటున్నారు.
ఇలా ప్రభుత్వంలో భాగమైన తన శాఖల మీద పట్టు సాధిస్తూనే తనను ఈ స్థాయిలో నిలబెట్టిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో కూడా పవన్ తన మార్క్ చూపించాల్సి ఉంటుంది. అయితే ఇటు సినిమాలు, అటు పాలనా పరమైన అంశాలతో నిత్యం బిజీగా ఉంటున్న పవన్ తన సొంత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా.? వారి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నారా.?
పిఠాపురం ప్రజలు ఆయన విధానాలతో సంతృప్తి చెందుతున్నారా.? అన్న అంశాల మీద పవన్ పూర్తిగా సమీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే గత కొద్దికాలంగా పవన్ అడ్డాలో అస్లీలత అంటూ కొన్ని అసభ్యకర నృత్యాలు, వాటి తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వాటి ఆధారంగా వీటి పై చర్యలు తీసుకోలేకపోతున్న పిఠాపురం ఎమ్మెల్యే అంటూ పవన్ పై ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇక వీటన్నిటికీ తోడు జనసేన పార్టీ అధినేతగా ఆ పార్టీకి అవసరమైన రాజకీయ భవిష్యత్ కు బాటలు వేయాల్సిన బాధ్యత కూడా పవన్ మీదే ఉంటుంది. పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. అలాగే పార్టీ భవిష్యత్ నాయకత్వాన్ని కూడా సృష్టించుకోవాలి, అలాగే ఉన్న నాయకత్వాన్ని పటిష్టం చేసుకోగలగాలి.
ఇలా పవన్ కళ్యాణ్ అటు సినిమాలను, ఇటు ఉప ముఖ్యమంత్రిగా, ఐదు శాఖలకు అధిపతిగా, ఒక ప్రాంత నియోజకవర్గ ప్రజలకు ప్రజాప్రతినిధిగా, ఒక పార్టీ అధినేతగా అన్ని పాత్రలలోను ప్రజలను, ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది. మరి ఇంత బరువు పవన్ కు భారం కానుందా.? లేక బలంగా మారనుందా.? నిత్యం పోటీ ప్రపంచంగా ఉండే గ్లామర్ ఫీల్డ్ లో క్రేజ్ ఉండగానే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది.
అలాగే ఇటు రాజకీయాలలో కూడా క్షణకాలం ఏమరపాటు కు ఒక్కో సందర్భంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల నిత్యం ఎలర్ట్ గా ఉంటూ ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టాల్సి ఉంటుంది. ఇలా పవన్ ఎంచుకున్న రెండు రంగాలలో ఎప్పటికప్పుడు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఒక్కో మెట్టు పైకెక్కాల్సి ఉంటుంది, అలాగే తనతో పట్టు తనను నమ్మిన వారిని కూడా పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
మరి ఇన్ని రకాల పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పవన్ ప్రస్తుతానికి “కత్తి మీద సాము చేస్తున్నారు” అనిపిస్తుంది.