నేడు తెలంగాణలో రేపు ఏపీలో అదే జరుగబోతోందా?

Telangana Elections AP

ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న తెలంగాణ ఎన్నికలను ఏపీలో అధికార వైసీపి నిశితంగానే గమనిస్తోంది. కానీ ఆ ఎన్నికల నుంచి అది ఏమైనా గుణపాఠం నేర్చుకొంటుందా లేదా?అంటే లేదనే అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంతో పాటు దళితబంధు వంటి భారీ సంక్షేమ పధకాలను కూడా కేసీఆర్‌ ప్రభుత్వం అమలుచేస్తోంది. పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలను తెచ్చుకొని లక్షలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తోంది. సాగునీటి రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక ప్రాజెక్టులు కడుతూ బీడువారిన తెలంగాణ భూములలో మూడు పంటలు పండించుకొనేందుకు రైతులకు తోడ్పడుతోంది.

ఇన్ని చేసినా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు! ఎందుకు?అంటే కేసీఆర్‌ అహంకారం వల్లనే! ఆయన అహం పరాకాష్టకు చేరిందని, మరోసారి గెలిపిస్తే అది మరింత పెరుగుతుందని, కనుక ఆయనను గద్దె దించాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ కోదండరామ్‌ వంటి మేధావులు వాదిస్తున్నారు. ఆయన అహం వలన ప్రతిపక్ష పార్టీలకే తప్ప ప్రజలకు ఏమీ నష్టం లేదు. అయినా మార్పు కోరుతున్నారంటే అనేక కారణాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు వింటే అది అర్దమవుతుంది.

ADVERTISEMENT

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొంటున్నారనేది దుష్ప్రచారమని కేసీఆర్‌, మంత్రులు కొట్టిపారేస్తున్నారు. కానీ అందరూ కాంగ్రెస్‌ని చూసి భయపడుతున్నారు. ఎందుకు?అంటే మార్పు జరుగబోతోందని గ్రహించినందునే కావచ్చు.

తెలంగాణ కాంగ్రెస్‌ను అది ప్రకటించిన ఆరు గ్యారెంటీలు గెలిపించబోవడం లేదు. బిఆర్ఎస్ పార్టీని అభివృద్ధి, సంక్షేమ పధకాలు రక్షించబోవడం లేదు.

“బిఆర్ఎస్ ఓటమికి, కాంగ్రెస్‌ గెలుపుకి కారణం కేసీఆర్‌ అహంభావమే కారణం కావచ్చు. కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలను గౌరవించపోవడం వలననే నేడు ఏటికి ఎదురీదవలసి వస్తోంది,” అని ఏబీఎన్ ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ చెప్పిన మాటలు అక్షరాల సత్యం.

ఏపీలో వైసీపి ప్రభుత్వం తీరు కూడా ఇంచుమించు ఇదేవిదంగా ఉందని అందరికీ తెలుసు. ప్రతిపక్షాలు కూడా ప్రజలు మార్పు కోరుకొంటున్నారనే చెపుతున్నాయి. వైసీపి కూడా ఇది గ్రహించింది. కానీ కేసీఆర్‌ లాగే జగన్‌ కూడా టిడిపి, జనసేనలు ఎత్తిచూపుతున్న లోపాలను సవరించుకోకుండా, ప్రజల ఆకాంక్షలను అర్దం చేసుకోకుండా, తమ ప్రభుత్వ వైఖరిని గుడ్డిగా సమర్ధించుకొంటూ తనదైన శైలిలోనే ముందుకు సాగిపోతున్నారు. కనుక నేడు తెలంగాణలో జరుగుతున్నదే రేపు ఆంధ్రాలో కూడా జరగవచ్చు.

ADVERTISEMENT
Latest Stories