
ఎన్నికల కోసం లేదా అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటే, పొత్తు ధర్మం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ పొత్తులు మరింత బలపడి ఎక్కువ కాలం కొనసాగుతుంటాయి.
ఆంధ్రాలో టీడీపీ, జనసేన, బీజేపిలు పొత్తు పెట్టుకొని అధికారంలోకి రాగలిగాయి. ఆ తర్వాత కూడా మూడు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగుతుండటంతో వాటి మద్య బంధం నానాటికీ బలపడుతోంది. కానీ బీజేపి కోసం టీడీపీ అవసరానికి మించి త్యాగాలు చేస్తోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read – కొమ్మినేనికి ప్రమోషన్ ఖాయమేనా.?
టీడీపీని, చంద్రబాబు నాయుడుని దారుణంగా దెబ్బతీయాలని ప్రయత్నించిన వైసీపీతోనే మెతక వైఖరి అవలభిస్తున్నప్పుడు, మిత్ర పక్షంగా, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపి పట్ల సిఎం చంద్రబాబు నాయుడు ఖరాఖండీగా ఉండాలని ఆశించలేము.
కనుక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ పదవులు మొదలు రాజ్యసభ సీట్లవరకు ప్రతీదానిలో బీజేపికి సిఎం చంద్రబాబు నాయుడు వాటా పంచి ఇస్తూనే ఉన్నారు. అది పొత్తు ధర్మం కూడా.
Also Read – కవితకి కష్టం వస్తే.. బీసీ రిజర్వేషన్స్ లేకుంటే లేదు!
అయితే టీడీపీలో చేరాలనుకున్న వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డెప్యూటీ చైర్ పర్సన్ జకీయా ఖానం వైసీపీకి, ఆ పదవులకు రాజీనామా చేసిన తర్వాత బీజేపిలో చేరడం చూసి టీడీపీ శ్రేణులు కూడా ఆశ్చర్యపోయాయి.
ఆమె వైసీపీని వీడాలని నిర్ణయించుకున్న తర్వాత మంత్రులు నారా లోకేష్, ఫరూక్ పలుమార్లు ఆమెతో సమావేశమై టీడీపీలోకి రావలసిందిగా ఆహ్వానించారు. అందుకు ఆమె కూడా సానుకూలంగా స్పందించారు.
Also Read – షర్మిల ఫోన్ కేసీఆర్ ట్యాపింగ్ చేయిస్తే నాకేం సంబందం?
కానీ ఆమె హటాత్తుగా పురందేశ్వరి సమక్షంలో ఏపీ బీజేపిలో చేరారు. ప్రధాని మోడీ ముస్లింల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు ఆకర్షితురాలై బీజేపిలో చేరానంటూ జకీయా ఖానం అటువంటి సమయంలో చెప్పాల్సిన స్టాండర్డ్ డైలాగ్స్ చెప్పారు.
ముస్లిం మతస్థురాలైన ఆమె టీడీపీలో చాలా సులువుగా ఇమడగలరు కానీ బీజేపిలో ఇమడటం చాలా కష్టం. కానీ సిఎం చంద్రబాబు నాయుడే ఆమెని బీజేపిలో చేరమని ప్రోత్సహించారా లేదా ఏపీ బీజేపి అధ్యక్షురాలు పురందేశ్వరి ఆమెకు ఏదో పదవి ఆఫర్ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారా?అనే విషయం తర్వాత తెలుస్తుంది.
ఏపీలో టీడీపీ, జనసేన, వైసీపీలు ఏవిదంగా స్వయంకృషితో బలపడ్డాయో ఆదేవిదంగా బీజేపి కూడా సొంత ప్రయత్నాలతో బలపడితే తప్పు లేదు. ఎవరూ అభ్యంతరం చెప్పలేరు కూడా.
కానీ టీడీపీలో చేరాల్సిన నేతలని, టీడీపీకి దక్కాల్సిన పదవులను బీజేపి సొంతం చేసుకుంటూ బలపడాలని అనుకోవడమే అభ్యంతరకరం.
ఒకవేళ బీజేపి కోసం ఆమెను వదులుకున్నట్లయితే, బీజేపి కోసం టీడీపీ ఇన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందా?అని శ్రేయోభిలాషుల ప్రశ్న.