Ys Jagan At Guntur Mirchi Yard

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో ఎన్ని లోపాలున్నప్పటికీ, తాడేపల్లి ప్యాలస్‌ నుంచి అడుగు బయటపెట్టనప్పటికీ ప్రజా సమస్యలని గుర్తించడంలో కూటమి ప్రభుత్వం కంటే ముందున్నారనిపిస్తుంది.

గుంటూరు మిర్చీ రైతుల సమస్యలని ఆయన లేవనెత్తి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన తర్వాతే సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ని కలిసి మిర్చీ రైతుల సమస్యల గురించి చర్చించడమే ఇందుకు తాజా నిదర్శనం

Also Read – జగన్‌ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!

“మిర్చీ ధరల గురించి జగన్‌కి ఏమీ తెలీకుండా మాట్లాడారని” రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు ఎదురుదాడి చేశారు.

కానీ సిఎం చంద్రబాబు నాయుడు మిర్చీ రైతుల సమస్యల గురించి వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మాట్లాడి పరిష్కరించాలని కోరారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుచెప్పారు. అంటే ఈ విషయంలో జగన్‌ వాదన నిజమని అంగీకరించిన్నట్లే కదా?

Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి అనేక సమస్యలను పట్టించుకోకుండా వదిలేసేవారు. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పడ్డాయని టీడీపీ, జనసేనలు, మీడియా ఫోటోలు, వీడియోలతో సహా చూపిస్తున్నా జగన్‌ పట్టించుకోలేదు.

ఎందువల్ల అంటే అప్పులు తెచ్చుకోవడం, బటన్ నొక్కడం, సంక్షేమ పధకాలకు డబ్బులు విడుదల చేయడం మాత్రమే జగన్‌ ప్రాధాన్యత కనుక. ఇటువంటి సమస్యలను ఆయన పట్టించుకోలేదంటే అర్దం చేసుకోవచ్చు.

Also Read – ఆంధ్ర అంటే ఇంకా నామోషీయేనా కేటీఆర్‌జీ?

కానీ వాట్సప్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలనే గొప్ప ఆలోచన చేసిన సిఎం చంద్రబాబు నాయుడు దృష్టికి మిర్చీ రైతుల సమస్య రాలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.

పైగా జగన్‌ ఈ సమస్యని ఎత్తి చూపిన తర్వాత కూడా దానిని అంగీకరించకుండా ఎదురుదాడి చేయడం ఈ వైఫ్యల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగానే అనిపిస్తుంది కదా?

కనుక ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మొత్తం బాధ్యత అంతా సిఎం చంద్రబాబు నాయుడుదే అని అనుకోకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతీ ఒక్కరూ శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది.

జగన్‌ చెప్పిన తర్వాత మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఆ క్రెడిట్ ప్రభుత్వానికి రాదు జగన్‌కే దక్కుతుందని గ్రహిస్తే మంచిది.