అయిపోయింది. అంతా అయిపోయింది! ‘జగన్ కోసం జనసంద్రాలు’ సొంత పత్రికలో అచ్చేసుకోవడానికి, సోషల్ మీడియాలో టముకు వేసుకోవడానికి బాగానే ఉంటుంది.
కానీ ఆ జనసంద్రం సృష్టించడం కోసం తన వంటి వైసీపీ నేతలు జేబులు ఖాళీ అయిపోతున్నాయని వైసీపీ నుంచి సస్పెండ్ చేయబడిన బడుకొండ అప్పలనాయుడు విజయనగరంలో నేడు ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పేశారు.
“ఇంకా పురిటి నొప్పులు తగ్గనమ్మని పరుగు పెట్టమన్నట్లు, ఎన్నికలలో ఓడిపోయిన వైసీపీ నేతలు పూర్తిగా తేరుకోకముందే జగన్మోహన్ రెడ్డి నెలకో కార్యక్రమాల పేరుతో బలవంతంగా రోడ్లపైకి రప్పిస్తున్నారు.
అదేదో ప్రజా సమస్యల కోసమైతే పర్వాలేదు. కానీ జైళ్ళలో ఉన్నవారిని పరామర్శించేందుకు లేదా ఎవరో చనిపోతే పరామర్శించేందుకు అయనగారు బయలుదేరినా మేమందరం జనసమీకరణ చేసి పంపించాలి.
ఇదివరకు ఆయన తండ్రి వైఎస్ఆర్, ఎన్టీఆర్ వంటివారి సభలకు ఎవరూ పిలవకపోయినా జనాలు వారంతట వారు హాజరయ్యేవారు.
కానీ మా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి చేతిలో డబ్బు పెట్టి సభలకు హాజరవడం అలవాటు చేసింది. కనుక ఇప్పుడు ఎవరినీ రమ్మంటే ఊరికే రావడం లేదు. జగన్ పరామర్శ యాత్రలకు జనసమీకరణ చేయాలంటే మా జేబులు ఖాళీ అయిపోతున్నాయి.
మొన్నటికి మొన్న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తుంటే, ఈయన జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి వస్తున్నానని చెప్పారు.
మాబావ చిన్న శ్రీను పూనుకోవడంతో మేమందరం లక్షలు ఖర్చు చేసి జనాలను ఏర్పాటు చేశాం. కానీ ఇలా ఎంత కాలం? అని అప్పుడే మాకు అనిపించింది. కానీ పార్టీలో ఉన్నప్పుడు అధినేత వెంట ఆ మాత్రం జనం ఉండాలని మౌనంగా జనసమీకరణ చేశాం.
పార్టీ కోసం ఇంత చేసినా చివరికి మెడ పట్టుకొని బయటకు గెంటేశారు. ఎందుకంటే చిన్న శ్రీను మా బావ కావడమే,” అంటూ మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు జనసంద్రం ఎలా పుడుతుందో చెప్పేశారు.
వేరెవరో జేబులో డబ్బు తీసి ఏర్పాటు చేసిన అటువంటి జనసంద్రంలో ఎంత ఈదినా ప్రయోజనం ఏమిటి? అలాంటి జనసంద్రాలు సృష్టిస్తున్న వైసీపీ నేతల పరిస్థితి ఏమిటి?
కళ్ళు మూసుకుంటే గిర్రున మూడేళ్ళు తిరిగిపోతాయని చెప్తున్నారు కనుక మూసుకొని కూర్చోవచ్చు కదా? కానీ ఇలా చీటికి మాటికీ జనసంద్రాలు సృష్టించాలంటే కష్టం కదా?
అయినా లక్షలు ఖర్చుపెట్టి సృష్టిస్తున్నవారిని ఇలా మెడ పట్టుకొని బయటకు గెంటేస్తే వారి పెట్టిన ఈ పెట్టుబడి అంతా ఒక్క దెబ్బతో పోయినట్లే కదా?
కనుక ఇకనైనా జనసంద్రం సృష్టించేవారు ముందుగా తమ బావలో బంధువులో ఎవరైనా పార్టీకి రాజీనామా చేస్తున్నారేమో ముందుగా తెలుసుకోవడం మంచిది. లేకుంటే లక్షల రూపాయలు ఖర్చు చేసి పక్కింటివాడి ఇంటి గోడకి సున్నం వేసినట్లే అవుతుంది.







