తానూ చేసిన వ్యాఖ్యలపై ఎన్ని విమర్శలు, ఎన్ని విశ్లేషణలు, మరెన్ని ఆరోపణలు వ్యక్తమవుతున్నప్పటికీ… ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మరోసారి సంచలన వ్యాఖ్యలకు వేదిక అయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లాలోని కదిరి నుంచి తన రైతు భరోసా యాత్రను కొనసాగించిన జగన్, మరోసారి ప్రభుత్వంపై, చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసారు.
ఎన్‌పీ కుంటలో 7500 ఎకరాలు సోలార్ ప్లాంట్ కోసం ప్రభుత్వం ధారాదత్తం చేసిందని, భూములను కోల్పోయిన రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, ఈ రోజు దారుణమైన పరిస్థితి నెలకొందని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని, చంద్రబాబుకి బుద్ధి, జ్ఞానం ఉన్నాయా..? పేదలంటే చంద్రబాబుకి ఎందుకింత కోపం? చంద్రబాబుకి ఎప్పటికైనా జ్ఞానం వస్తుందని ఆశిద్దాం” అంటూ మళ్ళీ దుమారం లేపే వ్యాఖ్యలకు తెరలేపారు.
నీళ్లున్న చోట సోలార్ ప్లాంట్ కట్టడమేంటీ..? అని ప్రశ్నించిన జగన్… చంద్రబాబుకు మనసు, మానవత్వం ఉన్నాయా..? అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తోలు మందం ఎక్కువైందని, అందుకే రైతులను పట్టించుకోవడం లేదని, హిట్లర్ లా వ్యవహరిస్తున్న చంద్రబాబు భూ కుంభకోణాలకు పాల్పడుతున్న వారిని రక్షిస్తున్నారని ఆరోపించారు.
దీంతో ఈ వ్యాఖ్యలు అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. కదిరిలో జగన్ యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కార్యకర్తలతో కలసి బయలుదేరిన కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జగన్ మరోసారి చంద్రబాబుపై నోరు జారితే ప్రత్యక్ష దాడులకు దిగుతామని అన్నారు. జగన్ ప్రజలను ఎలా ఉసిగొల్పుతున్నాడో అదే రీతిలో సన్మానం తాను చేస్తానని ఆయన తెలిపారు. ఈ పరిణామాల నేపధ్యంలో దీటుగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిధ్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడెలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోనని పోలీసులు అప్రమత్తమయ్యారు.



