నాడు కేసీఆర్ తెలంగాణలో బిజేపి ఎదుగుదలని నేరుగా అడ్డుకునే బదులు, ప్రధాని మోడీపై కత్తులు దూస్తూ కేంద్రంతో యుద్ధం మొదలుపెట్టారు. పైగా కేసీఆర్ ఆ పోరాటాలతో తనని తాను జాతీయస్థాయి నాయకుడుగా ప్రమోట్ చేసుకోవాలని దురాశకు పోయారు. ఒకవేళ తెలంగాణలో బిజేపిని రాష్ట్ర స్థాయిలోనే ఎదుర్కొని ఉండి ఉంటే, నేడు తెలంగాణలో రాజకీయాలు, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి వేరేగా ఉండేదేమో?
నాడు కేసీఆర్ వ్యవహరించిన తీరుగానే ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పలేము. కానీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆనాటి పరిస్థితే మళ్ళీ కనిపిస్తోంది.
ఇందుకు ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్లో బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించి ‘మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణయే’ అని ప్రకటించడమే కావచ్చు.
దీంతో సిఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమై హైదరాబాద్ మెట్రోతో సహా పలు ప్రాజెక్టులు, పధకాల విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తున్నారు.
‘మన నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ’ అని ప్రధాని మోడీ చెప్పేశారు కనుక తెలంగాణ బిజేపి నేతలు కూడా సిఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్‌పై కత్తులు దూయడం మొదలుపెట్టారు.
తెలంగాణలో బిజేపిని అడ్డుకునే బదులు కేసీఆర్ ఢిల్లీ పెద్దలతో యుద్ధాలు మొదలుపెట్టడం వలననే నష్టపోయారని సిఎం రేవంత్ రెడ్డికి తెలియదనుకోలేము. కానీ అయన కూడా తెలంగాణలో బిజేపిని అడ్డుకునే ప్రయత్నంలో కేంద్రంపై కత్తులు దూస్తుండటమే కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.
కాంగ్రెస్ అధిష్టానం ఆయనని జాతీయస్థాయి నాయకుడుగా గుర్తించి ప్రాధాన్యం ఇస్తోంది కనుక అయన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకోవడం సహజమే. కానీ ఆ ప్రయత్నంలో కేసీఆర్ చేసిన రాజకీయ తప్పులు చేయకుండా నిగ్రహించుకోవడం చాలా అవసరం.
రేవంత్ రెడ్డి జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఉన్నందున మరికాస్త బలంగా కనిపించవచ్చు. కానీ జాతీయస్థాయిలో బిజేపిని, ముఖ్యంగా మోడీ-అమిత్ షాలను ఎదుర్కోలేని దుస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందనే సంగతి గుర్తుంచుకోవడం చాలా అవసరం.
మెట్రో లేదా మరో విషయంలో బిజేపిని తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టగలిగితే అడ్డుకోవచ్చనే కేసీఆర్ ఆలోచన వికటించింది. కనుక తెలంగాణలో బిజేపిని రాష్ట్ర స్థాయిలోనే ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని, తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే మంచిది.




