సుప్రీంకోర్టుకి వెళ్ళి వైసీపి ప్రభుత్వం ఏం సాధించింది?

Chandrababu_Naidu_YS_Jagan

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో రాష్ట్ర హైకోర్టు రెగ్యులర్ బెయిల్‌ మంజూరు చేయడాన్ని వైసీపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ‘అత్త కొట్టినందుకు కాదు… తోటికోడలు నవ్వినందుకే ఏడుస్తున్నా’ అన్నట్లుంది ఈ కేసు విషయంలో వైసీపి ప్రభుత్వం తీరు.

వచ్చే ఎన్నికలలో సులువుగా గెలిచేందుకు ఈ కేసుతో చంద్రబాబు నాయుడుపై అవినీతిముద్రవేసి, ఎన్నికల వరకు జైల్లోనే ఉంచేయాలనుకొంటే, హైకోర్టు చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్‌పై మంజూరు చేసింది. అయితే వైసీపి అందుకు బాధపడి ఉండక పోవచ్చు. కానీ ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ, ‘ఆయన అవినీతికి పాల్పడిన్నట్లు ఏపీ సీఐడీ ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయిందని, చంద్రబాబు నాయుడుని ఏదోవిదంగా అరెస్ట్ చేసి లోపల వేయాలనే యావే తప్ప ముందు కేసుకు సంబందించి బలమైన సాక్ష్యాధారాలు సిద్దం చేసుకోవాలనే ఆలోచన చేయలేదని చురకలు వేసింది. బహుశః హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యాలే వైసీపి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయిందని చెప్పవచ్చు. అందుకే హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు వెళ్ళింది.

ADVERTISEMENT

ఒకవేళ వైసీపి ప్రభుత్వం కోరుకొన్నట్లుగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడి బెయిల్‌ రద్దు చేసి ఉండి ఉంటే, ఆయన అవినీతిపరుడని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసిందిగా అంటూ వైసీపి నేతలు గొప్పగా చెప్పుకొనేవారు. కానీ సుప్రీంకోర్టు కూడా ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత చంద్రబాబు నాయుడు బెయిల్‌ కొనసాగించడమే కాకుండా రాజకీయ సభలు, సమావేశాలు కూడా నిర్వహించుకోవచ్చని చెప్పడం వైసీపి అధినేతకు మరో పెద్ద షాక్ అనే చెప్పాలి.

అంతేకాదు… స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసుని కొట్టివేయాలంటూ చంద్రబాబు నాయుడు తరపున దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌తో పాటు దీనినీ కలిపి విచారించాలని చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్దార్థ్ లుద్రా అభ్యర్ధనను కూడా సుప్రీంకోర్టు మన్నించింది. ఇది వైసీపి అధినేతకు మరో షాక్ అనే చెప్పాలి. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్‌ 8కి వాయిదా వేస్తూ అంతవరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని సుప్రీంకోర్టు వైసీపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. కనుక వైసీపి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమి సాధించింది? అంటే మరింత నవ్వుల పాలైందని అర్దమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories