బీఆర్ఎస్ పార్టీ నీళ్ళ పేరుతో ఆంధ్రా ప్రభుత్వాన్ని, పాలకులను నిందిస్తుంటే, తమ నీళ్ళు ఎత్తుకుపోతున్నారని పదేపదే ఆరోపిస్తుంటే, సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఎందుకు స్పందించడం లేదు?
కనీసం సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎందుకు వారి ఆరోపణలను ఖండించడం లేదు?
కనీసం పార్టీల పరంగా కూడా వారికి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? అని ఆంధ్రా ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా సందేహాలున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి అంశాలతో తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసి, రాజకీయంగా మైలేజ్ లేదా లబ్ధి పొందాలని ఆశిస్తుందనేది బహిరంగ రహస్యం. కనుక దానికి ఆ అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ మౌనం వహిస్తోందని భావించవచ్చు.
ఇక జగన్-కేసీఆర్, కేటీఆర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అవి చెడిపోవాలని జగన్ కోరుకోరు. కనుక ఈ విషయంలో వైసీపీ కూడా మౌనం వహిస్తుంది.
ఇవేకాక, బయటకు చెప్పుకోలేని కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అవేమిటో రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు.
అయితే ఇంతకాలం ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను ముడిపెట్టి నిందిస్తున్న హరీష్ రావు, నిన్న హఠాత్తుగా జగన్ మీదకు బాణాలు సంధించారు!
నాడు కేసీఆర్ రాయలసీమ ప్రాజెక్టును ఆపాలని కేంద్ర మంత్రి ఎదుటే జగన్‌ను గట్టిగా హెచ్చరించారని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ తరఫున మాజీ మంత్రి పేర్ని నాని బదులివ్వడమే అనూహ్యమనుకుంటే, జగన్ కూడా కొద్దిసేపటి క్రితమే బదులివ్వడం మరింత అనూహ్యం.
“మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు! దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవు, కొత్త కాల్వలు లేవు, అదనపు రిజర్వాయర్లు లేవు, అదనపు ఆయకట్టూ లేదు! అదే కృష్ణానది, అవే నీళ్ళు, అవే కేటాయింపులు..” అంటూ రాయలసీమ ప్రాజెక్టు, నీళ్ళ వినియోగం గురించి ‘ఎక్స్’లో చాలా పెద్ద పోస్ట్ పెట్టారు.
అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను ముడిపెట్టి విమర్శిస్తుంటే, ఇప్పుడు జగన్ కూడా ‘కాంగ్రెస్‌తో హాట్‌లైన్ దోస్తీ కోసం’ మౌనంగా ఉండిపోతున్నారంటూ ఇద్దరినీ ముడిపెట్టి సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శించారు.
అంటే ఇంతకాలం బీఆర్ఎస్ ఒక్కటే నీళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తూ మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తుంటే, ఇప్పుడు వైసీపీ కూడా దాంతో చేతులు కలిపినట్లు సందేహం కలుగుతోంది. ఇందుకు బలమైన కారణమే కనిపిస్తోంది.
ఏ కోణంలో చూసినా రెండు రాష్ట్రాల్లోని రెండు పార్టీల పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉంది. కనుక ఇప్పుడు వైసీపీ కూడా నీళ్ళ పేరుతో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై కత్తులు దూస్తూ, ఏపీలో ‘ఆంధ్రా సెంటిమెంట్’ సృష్టించి, వారి బారి నుంచి ఏపీని వైసీపీ మాత్రమే కాపాడగలదనే కొత్త వాదనలు వినిపిస్తుందేమో?
రాయలసీమ లిఫ్ట్ స్కీంపై, తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వాస్తవాలను మరుగున పరుస్తోంది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన @ncbn తన హాట్‌లైన్ కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాలకోసం మౌనంగా ఉన్నాడు.
మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు! దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవు, కొత్త కాల్వలు లేవు, అదనపు రిజర్వాయర్లు లేవు, అదనపు ఆయకట్టూ లేదు! అదే కృష్ణానది, అవే నీళ్లు, అవే కేటాయింపులు, అదే పోతిరెడ్డిపాడు నుంచి అవే కాల్వల ద్వారా దుర్భిక్ష పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే, అవే రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన, అవే జలాలనే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఇన్సూరెన్స్ స్కీం లాంటిదే ఈ పథకం.
కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో, పైనుంచి నీళ్లు రాకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన ఆ నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఇష్టానుసారంగా దిగువకు వదిలేయడం మరొక తీవ్రమైన సమస్య.
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా, శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో, అంటే 44వేల క్యూసెక్కుల నీళ్లు పారాలంటే శ్రీశైలంలో నీటిమట్టం కనీసం 880 అడుగులపైన ఉండాలి. ఆ నీటి మట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లే పంపలేం. ఆ 880 అడుగులపైన రిజర్వాయర్ లెవల్ ఎన్నిరోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. దీనివల్ల రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలు తీరడం అసాధ్యంగా మారుతూ వస్తోంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేందుకు, పాలమూరు-రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ద్వారా 0.5 రోజుకు టీఎంసీ, కల్వకుర్తి ద్వారా రోజుకు 0.4 టీఎంసీ , ఎస్ఎల్బీసీ ద్వారా రోజుకు 0.5 టీఎంసీ, మొత్తంగా దాదాపుగా రోజుకు 3 టీఎంసీలు తరలించే సామర్థ్యంతో జోరుగా ముందుకెళ్తోంది. వీటికి తోడు 800 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని వదిలేస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రత్యామ్నాయంగా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ స్కీంను చేపట్టాం. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోలేని సంక్లిష్టమైన పరిస్థితుల్లో లిఫ్ట్ చేసి, అదే పోతిరెడ్డిపాడు కాల్వలోకి నీటిని ఎత్తిపోసి, ఇప్పటికే ఉన్న పాత రిజర్వాయర్లకు చేరవేయడమే ఈ పథకం ఉద్దేశం. నీటి కేటాయింపులు ఉన్నా, వినియోగించుకునే అవకాశం లేకపోతే ఆ కేటాయింపులకు సార్థకత ఏముంటుంది? అదనపు నీటి కేటాయింపులు, అదనపు రిజర్వాయర్లు లేనప్పుడు ఈ పథకం వల్ల ఎవరికి, ఏం నష్టం వస్తుంది? ప్రజల దాహార్తిని తీర్చే ఇన్సూరెన్స్ లాంటి రాయలసీమ లిఫ్ట్ స్కీంను భూతద్దంలో చూపించడం భావ్యమా?
దురదృష్టవశాత్తూ, దాదాపుగా పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే, ఎక్కడ జగన్‌కు పేరువస్తుందోనని ఆపేశారు. ఈ పథకాన్ని పూర్తిచేయాల్సింది పోయి, ఎవరైనా అభ్యంతరం చెప్తే, దాని ఆవశ్యకతను బలంగా వినిపించాల్సిందిపోయి, హాట్‌లైన్ రాజకీయాలకోసం బలిపెట్టారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరువులాంటి విపత్కర పరిస్థితుల్లో హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీసి, రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరివేశాడు.
ఎవరికీ నష్టం కలిగించని ఈ పథకంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదు.
#RayalaseemaLiftIrrigation
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 26, 2026





