ఆ విషయంలో కేసీఆర్‌ కంటే మన జగనే చాలా బెటర్!

KCR Jagan

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ కంటే మన ఏపీ సిఎం జగన్‌ చాలా విషయాలలో బెటర్ అని చెప్పుకోక తప్పదు. తెలంగాణలో తుఫానులు, వరదలు వచ్చి ఊర్లు, పంటలు నీటమునిగిపోతున్నా కేసీఆర్‌ ఏనాడూ ప్రగతిభవన్‌ గుమ్మం దాటి బయటకురాలేదు. ఎవరినీ పరామర్శించలేదు.

చివరికి హైదరాబాద్‌ నగరం నీట మునిగిపోతున్నా కేసీఆర్‌ ఏనాడూ ప్రగతిభవన్‌ బయటకు వచ్చి తొంగిచూడలేదు. ఎవరి గోడు పట్టించుకోలేదు. ఎప్పుడైనా ఎవరినైనా ఓదార్చవలసివస్తే వారినే ప్రగతి భవన్‌కు రప్పించుకొని ఓదార్చి పంపిస్తుండేవారు. కనుక మిగిలిన నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఆయన తరపున మాజీ మంత్రి కేటీఆరే పరామర్శిస్తుండేవారు. ఓదార్చుతుండేవారు.

ADVERTISEMENT

కానీ ఈ విషయంలో కేసీఆర్‌ కంటే మన సిఎం జగనే చాలా బెటర్. ఉదాహరణకి… దసరాకి పాలపిట్టని చూస్తే శుభం జరుగుతుందని తెలంగాణ ప్రజల నమ్మకం. కనుక కేసీఆర్‌ కోసం అధికారులు పాలపిట్టని పంజరంలో బందించి ప్రగతిభవన్‌కి తెచ్చి చూపించారు. కానీ శుభం జరగలేదు. ఎన్నికలలో ఓడిపోయారు. ఆ టెన్షన్‌లో జారిపడి తుంటి ఎముక విరగొట్టుకొన్నారు కూడా. అది వేరే సంగతి.

కానీ మన సిఎం జగన్‌ ఆయనలాగ దెబ్బ తిన్న పంటలను, బాధితులను తాడేపల్లి ప్యాలస్‌కు తీసుకు రమ్మనమని అధికారులను ఆదేశించలేదు!ఆయనే స్వయంగా అక్కడకు వెళ్ళారు!

కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి కాస్త తొందర, చాదస్తం రెండూ ఎక్కువే. కనుక ఆయన కంటే ముందే బయలుదేరిపోయి, పొలాలలోకి దిగి స్వయంగా పంట నష్టాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం చెపుతుంటారు. అందుకు జగన్మోహన్‌ రెడ్డిని ఎలా తప్పు పట్టగలము?

కానీ జగన్‌ ముఖ్యమంత్రి కనుక భద్రతా కారణాల చేత పంట పొలాలలో తూలి పడిపోకుండా పక్కన బారికేడ్లు వేస్తారు. ఎండ తగలకుండా టెంట్ వేస్తారు. బూట్లకి బురద అంటకుండా ఎర్ర తివాచీ కూడా పరుస్తారు. అక్కడి నుంచే సార్ పంటలను వీక్షిస్తారు. అప్పుడు అధికారులు, రైతులు నాలుగు వరి దుబ్బులు పీకి ఆయన వద్దకే పట్టుకొచ్చి చూపిస్తుంటారు. వీటికీ గిట్టనివాళ్ళు సన్నాయి నొక్కులు, ముసిముసి నవ్వుతుంటారు.

“వరి అంటే సుగర్ కేనే కదా?”అని ప్రశ్నిస్తే తప్పు పట్టడానికి గిట్టనివాళ్ళు చాలా మందే కాసుకు కూర్చోన్నారు కనుక సార్ ‘ఓకే ఓకే…’ అనేసి ఉండవచ్చు. ఆ తర్వాత వరద బాధితులను పరామర్శించి వారందరికీ ‘పొటాటోలో ఉల్లిపాయలో… బంగాదుంపలో పంచిపెడుతుంటారు కూడా. అయినా గిట్టనివాళ్ళు అవాకులు చవాకులు వాగుతూనే ఉంటారు. ఏం చేస్తాం లోకం తీరే అంత!

ADVERTISEMENT
Latest Stories