ఒక్క వారం… జగన్ ఫేట్ మారిపోయింది..!

Jagan Mohan Reddy fate changed in one weekవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిని వరుస ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అధినేతకు తగులుతున్న సీక్వెల్ దెబ్బలను చూసి పార్టీ నేతల్లో గుబులు మొదలైందనేది కాదనలేని సత్యం. నంద్యాల ఓటమి నుంచి తేరుకోకముందే కోర్టులో జగన్‌ కు చుక్కెదురైంది. ఆ షాక్‌లో ఉండగానే కాకినాడ ఓటర్లు జగన్‌ కు భారీ ఝలక్కిచ్చారు. అన్ని వైపులా నుండి కేవలం రోజుల తేడాతో వరుసపెట్టి తగులుతున్న దెబ్బలు ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ADVERTISEMENT

నంద్యాల ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కాకినాడలో ప్రచారం చేసిన జగన్ అచ్చం నంద్యాల వ్యూహాన్నే ఎంచుకుని టీడీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2019లో జరగనున్న ఎన్నికల కురుక్షేత్రానికి కాకినాడ ఎన్నికలు నాంది కావాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే కాకినాడ ఓటర్లు ఆయన మాటలను పక్కన పెట్టి, ఘోరంగా ఓడించారు. అలాగే నంద్యాల ఓటమి తర్వాత నిరాశలో మునిగిపోయిన జగన్‌ కు ప్రజలతో పాటు న్యాయవ్యవస్థ కూడా షాకిచ్చింది.

ఆయా కేసుల విచారణకు సంబంధించి వ్యక్తిగత హాజరు విషయంలో మినహాయింపు కోసం కోరగా, ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. హాజరు నుంచి మినహాయింపు కోసమే పాదయాత్రను తెరపైకి తెచ్చినట్టు ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. అదే ప్రకారం హాజరయ్యారు కూడా! దీంతో అక్టోబరు 27 నుంచి జగన్ ఒకవేళ పాదయాత్ర చేపట్టినా, ఆ సమయంలో ఎక్కడ ఉన్నా, శుక్రవారం మాత్రం కోర్టుకు హాజరుకాక తప్పని పరిస్థితి. ఇలా వారం వ్యవధిలోనే మూడు ఘటనలు వైసీపీని కలవరపరుస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories