జగన్ అడపా దడపా శవరాజకీయాల కోసం ప్రజల మద్యకు వస్తున్నారే తప్ప ఇంతవరకు పార్టీ కార్యక్రమాలు చేపట్టలేదు. సంక్రాంతి పండుగ తర్వాత ప్రజల మద్యకు వస్తానని మీడియా లీక్ ఇచ్చారు.
పుష్ప-2కైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పనిసరి అయినప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్న జగన్‌కు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉండక్కరలేదా?అంటే తప్పనిసరిగా ఉండాలి.
ఎలాగూ కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి ఓటమికి ఆరు నెలలు పూర్తయ్యాయి కనుక డిసెంబర్ 11 నుంచి మూడు దశలలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే వైసీపీ ఆందోళనలు నిర్వహించాలని పార్టీ నేతలను ఆదేశించారు. తద్వారా కూటమి ప్రభుత్వం రియాక్షన్ ఏవిదంగా ఉంటుందో, ప్రజల రియాక్షన్ ఏవిదంగా ఉంటుందో తెలుస్తుంది కూడా. అన్నీ సవ్యంగా ఉన్నాయనిపిస్తే సంక్రాంతి పండుగ తర్వాత ప్యాలస్ నుంచి జగన్ రిలీజ్ అవుతారు.
డిసెంబర్ 11న రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించి రైతులకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తారు. పనిలో పనిగా జగన్ హయాంలో రైతులను ఏవిదంగా ఉద్దరించిందీ ప్రజలకు వివరిస్తారు.
డిసెంబర్ 27న విద్యుత్ చార్జీల పెంపుపై విద్యుత్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాలు ఉంటాయి.
సెకీతో చేసుకున్న ఒప్పందం వలననే విద్యుత్ ఛార్జీలు పెంచవలసి వస్తోందని కూటమి ప్రభుత్వం వాదిస్తుండగా, సెకీ అంటే (అదానీ గ్రూప్)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వలన రాష్ట్రానికి లక్ష కోట్లు మిగిల్చానని జగన్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఒప్పందం వలన కరెంట్ ఛార్జీలు తగ్గే మాటాయితే కూటమి ప్రభుత్వం ఛార్జీలు ఎందుకు పెంచుతోందో వైసీపీ నేతలే వివరిస్తారు.
జనవరి 3న ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్ కోసం జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసి బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పణ కార్యక్రమాలు ఉంటాయి.
జగన్ జనాల మద్యకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు కనుక మరి ప్రభుత్వం ఏవిదంగా స్పందిస్తుందో, టీడీపీ నేతలు ఏవిదంగా స్పందిస్తారో?




